calender_icon.png 19 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వలేం

17-04-2025 02:11:42 AM

  1. 73 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ
  2. హిందూ సంస్థల్లోకి ఇతరులను అనుమతిస్తారా? 
  3. వందల ఏళ్లనాటి ఆస్తులకు పత్రాలు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తాయి?
  4. సుప్రీం సూటి ప్రశ్న.. నేడు మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ‘హిందూ మత సంస్థల్లోకి ఇతర మతస్తులను అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నారా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అలాగే, వందల ఏళ్లనాటి ఆస్తుల కు సంబంధించిన పత్రాలు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తాయని అడిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్  ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడింది.

ఈ క్రమంలోనే వక్ఫ్‌బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులకు స్థానం కల్పించే నిబంధనను ఉద్దేశిస్తూ హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో ముస్లింలకు చోటు కల్పించేందుకు వీలవుతుందా? అని కేంద్ర ప్రభు త్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణ నేపథ్యంలో వక్ఫ్‌పై సుప్రీం సీజేఐ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు.

వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని వ్యాఖ్యానించారు. ‘సుదీర్ఘకాలం నుంచి ముస్లిం కార్యక్రమాలకు వాడుతు న్న ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. ఇది పలుమార్లు దుర్వినియోగమైంది. అయితే, నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.

హిందు వుల ఆస్తులను హిందువులే నిర్వర్తిస్తున్నారు కదా. వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటిం చడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు.  కేసుపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

ఆర్టికల్ 26 ఉల్లంఘన

ఈ కేసులో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాద నలు వినిపించగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్ కౌన్సిల్‌లోకి ముస్లిమేతరకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆర్టికల్ 26ను కేంద్ర ప్రభుత్వం ఉల్లఘించిందని కపిల్ సిబాల్ వాదించారు. కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం 200 మిలియన్ల మత విశ్వాసాన్ని దెబ్బ తీసిందని పేర్కొన్నారు.

ఈ చట్టం ద్వారా వక్ఫ్ అర్థాన్నే ప్రభుత్వం మార్చేసిందన్నారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం వక్ఫ్‌ను  నెలకొల్పాలంటే ఓ వ్యక్తి తాను గత ఐదు సంవత్సరాలుగా ముస్లిం సంప్రదాయాలను ఆచరిస్తున్నట్టు నిరూపించు కోవాల్సి ఉంటుందన్నారు. ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ముస్లిం సంప్రదాయాలను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వాలు ఎలా ధ్రువీకరిస్తాయని సిబాల్ ప్రశ్నించారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ తుషార్ మెహతా జనరల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా అన్ని వర్గాలతో సంపూర్ణంగా చర్చలు జరిపిన తర్వాతే చట్టాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేనని.. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయవచ్చా?  కలెక్టర్ దర్యాప్తు సమయంలో వక్ఫ్ గుర్తింపుపై స్టే విధించడం సముచితమేనా? వక్ఫ్ బోర్డు లో ముస్లిమేతరులను చేర్చుకోవచ్చా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని పై వాదించడానికి సొలిసిటర్ కొంత సమయం కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. గురువారం విచారణ ముగిసిన తర్వాత ఈ అంశాలపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.