02-04-2025 01:53:32 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): వక్ఫ్ చట్ట సవరణ బిల్లు(Waqf Act Amendment Bill)ను కేంద్రమంత్రి కిరణ్ రిజిజ్(Union Minister Kiren Rijiju) లోక్ సభ(Lok Sabha)లో బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రసంగించారు. వర్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని, బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు లోక్ సభలో వ్యతిరేకించాయి. బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని, వక్ఫ్ చట్టం అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదని సభ ముఖంగా గుర్తు చేశారు. వక్ఫ్ చట్ట సవరణలపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృతం చేస్తామని తెలిపారు. 1995లోనే ట్రైబ్యునల్ వ్యవస్థ ఏర్పాటైందని, వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ట్రైబ్యునల్ లో సవాల్ చేయవచ్చని కేంద్రమంత్రి వెల్లడించారు.
వక్ఫ్ చట్ట సవరణ ప్రస్తావన ఇప్పటిది కాదని, 2013లోనే మొదలైందని, వక్ఫ్ అనేది లౌకికంగా, సమ్మిళితంగా ఉండాలని కోరుకుంటున్నామని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. గతంలో వక్ఫ్ బోర్డులో మహిళలను ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు కచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలని, భారత్ లో ముస్లీంలు ఎందుకు పేదలుగానే ఉన్నారని అడిగారు. వక్ఫ్ బోర్డులో మరింత పారదర్శకత తీసుకురావాలనేదే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. యూపీఏ హయాంలో వక్ఫ్ బోర్డును షియా, సన్నీ, ఇతర బోర్డుల్లో ఆ వర్గాల వారే ఉండేవిధంగా విభజించారని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. గతంలో వక్ఫ్ బోర్డు ఆదాయం చాలా తక్కువగా ఉండేదని, పేద ముస్లింలను అభివృద్ధిలోకి తేవాలనేది లక్ష్యంగా ఉండేదని గుర్తు చేశారు. పార్లమెంట్ భవనం సహా ఢిల్లీలోని పలు ఆస్తులు తమవేనని గతంలో వక్ఫ్ బోర్డు చెప్పిందని వెల్లడించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ఏళ్ల తరబడి కోర్డులో కేసు నడిచిందని, ఈ సమయంలో 123 ఆస్తులను వక్ఫ్ బోర్డుకు యూపీఏ సర్కారు కట్టబెట్టిందని వివరించారు. ఎన్డీఏ సర్కారు రకాపోయి ఉంటే పార్టమెంటు భవనం కూడా డీనోటిపై చేసేవారని మంత్రి కిరణ్ రిజిజ్ వివర్శించారు.