calender_icon.png 18 April, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాధ్యం సుసాధ్యం కావాలంటే?

26-03-2025 12:00:00 AM

ఏవమశ్రుత శాస్త్రార్థో 

న మంత్రం శ్రోతు మర్హతి

 కౌటిలీయం: (1“శాస్త్రార్థాన్ని (అర్థశాస్త్రాన్ని) అభ్యసించని వారికి మంత్రాన్ని (మంత్రాంగాన్ని) వినే అర్హత లేదు” అంటాడు చాణక్య. సాధారణంగా రాజకీయాలు స్వార్థభరితం, అవినీతిమయం, అపవిత్రమైనవని భావిస్తూ చాలామంది సమర్థులు వాటికి దూరంగా ఉంటారు. ఉత్తముల ఉదాసీనతయే అర్హత లేని నాయకులకు అధికా రాన్ని కట్టబెడుతుంది. వారి నిర్ణయాలే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంటా యి. రాజకీయ చైతన్యమే సమాజాన్ని ఉన్నతీకరిస్తుంది. ప్రజలను ప్రగతి పథం లో నడిపిస్తున్నది. అలాంటి నేతల అడుగుజాడలే వ్యాపార సామ్రాజ్యాలను నడిపే పారిశ్రామిక వేత్తలకూ మార్గదర్శనం చేస్తూ సంపదను సృష్టిస్తాయి.

ప్రభావశీలమైన రాజకీయం నియమం గా, నిరంతరం అభ్యసించవలసిన శాస్త్రం. అలాగే, ఒక సంస్థను నడిపే నాయకులు నిర్వహణా నైపుణ్యాలను అభ్యసించాలి. వివిధ విభాగాలకు సమర్థులైన నిర్వాహకులను నియమించి వారిని ప్రతిభావం తంగా ఉపయోగించుకోవడం నేర్పాలి. కాలావధిలో వారితో సమావేశమవుతూ సమీక్షలు జరపాలి. వివిధ విభాగాలను సమన్వయం చేయడంలో ఏర్పడే లోపా లు, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

“అలాంటి శాస్త్రజ్ఞానం లేని నాయకుడు మంత్రాంగానికి పనికిరాడు” అన్నది చాణక్యుని అభిప్రాయం. ఆంగ్లం లో ‘క్యాచింగ్ వైల్డ్’ పిగ్స్ (అడవి పందులను పట్టడం) అనే జాతీయం ఒకటున్నది. ఇక్కడ అడవి పందులంటే మార్కెట్ స్థితిగతులు, వినియోగదారుని అవసరాలు, సంస్థ సామర్థ్యం. ఇంకా నాయకుడు తన పరిధిని, బృందం పరిమితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, సహచరుల ఆలోచనలను శ్రద్ధగా వినడం, అవగాహన చేసు కోవడం, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రచించుకోవడం వంటివన్నీ అందుకు ప్రతీకగానే భావించాలి.

ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాయకుల చొరవ, సంయమనత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లాంటివి వ్యాపార దిగ్గజాలు అధ్యయనం చేయాలి. అప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించే విధానం, అధికా రం విలువ, దాని శక్తి అవగతమవుతాయి.

వ్యాపార రంగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, వినియోగదారులతో సం బంధాలను పెంచుకోవడానికి అవి ఉపయుక్తమవుతాయి. ప్రజల మధ్య తిరిగే నాయకులకు, కార్యాలయాలకు పరిమిత మై వ్యవహారాన్ని నడిపే అధికారులకు మధ్య భేదం ఉంటుంది. దానిని అవగాహ న చేసుకొని ఆచరణలో పెట్టిన నాయకుడు ఉత్తమ ఫలితాలను సాధిస్తాడు.

అడవి పందిని పట్టాలంటే ముందుగా అది తిరిగే ప్రాంతాలలో కొంత ఆహారాన్ని ఉంచుతారు. మొదట్లో అది పారిపోయినా క్రమంగా ఆహారాన్ని తినేందుకు అలవా టు పడుతుంది. అప్పుడు ఒకవైపు కంచెను వేస్తారు. దానిని అలా ప్రతిరోజు వచ్చేందుకు అలవాటు చేసి క్రమంగా నాలుగువైపులా కంచెను వేయడం వల్ల అదెటూ పోలేక చిక్కుతుంది.

ఉచితంగా లభించిన ఆహారంతో, సౌకర్యవంతమైన వలయం లో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి బానిసగా మారిన అడవి పందిని పట్టుకోవడం ఆ రకంగా తేలికవుతుంది. రాజకీయ నాయకులు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన విధానాలను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా అలవరుస్తారు.

తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు పౌరుల ను అలవాటు చేస్తూ వ్యతిరేకతను అధిగమిస్తారు. తమ విధానాలకు అనుగుణ మైన విషయాలను పదేపదే వ్యూహాత్మకం గా ప్రచారం చేస్తారు. ఇవన్నీ పౌరుల ఆలోచనలను ప్రభావితం చేస్తూ, వ్యతిరేకతను అనుకూలంగా మార్చేస్తాయి. ఈ రకంగా వారు తమ కార్యాలను సాధిస్తుంటారు.

ప్రతికూలత నుంచి సానుకూలానికి!

వ్యాపార రంగంలో నాయకుడు కొత్త ఆలోచనలతో సంస్థలో సమూలమైన మార్పులను తేవాలని అనుకున్నప్పుడు, వాటిని ఉద్యోగ బృందాలు, భాగస్వాము లు వ్యతిరేకిస్తారని భావించిన పక్షంలో, క్రమక్రమంగా వాటిని అమలుచేసే ప్రయ త్నం చేస్తారు. వారి వ్యతిరిక్తతను అనుకూలతగా మార్చుకుంటారు. పట్టువిడుపులు కలిగిన నాయకుడు తన విధానాలపై గౌరవప్రదంగా ఉద్యోగులలో అవగాహనను పెంచుతూ వారే దానిపట్ల ఆకర్షితులయ్యే లా ప్రచారం చేస్తారు.

మార్పుల అవసరా న్ని, వాటి ప్రయోజనాలను వారికి అర్థమయ్యేలా నెమ్మదిగా నచ్చచెప్పే పారదర్శక మైన, సమాచార వ్యవస్థతో కూడిన యం త్రాంగాన్ని ఏర్పరుస్తాడు. దాంతో నాయకుని సమర్థతపై నమ్మకం ఏర్పడి ఉద్యోగు ల్లోని వ్యతిరేకత తగ్గిపోతుంది. క్రమంగా వారూ ఆ వ్యవస్థలో భాగస్వాములవుతా రు. అవసరమైన శిక్షణను, సహకారాన్ని అందించడం వల్ల వ్యతిరేకత అనుకూలతగా మారుతుంది.

వ్యక్తులు కొత్తదనాన్ని ముందుగా ప్రతిఘటిస్తారు. తదుపరి ఆలోచిస్తారు. చివరగా అనుమోదిస్తారు. కొత్త విధానంలో ఉద్యోగులు సాధించిన చిన్న విజయాన్నైనా అభినందిస్తే వారికి అది ప్రేరణగా ఉత్తేజాన్నిస్తుంది. సంస్థ ఆశయాలపై లోతైన అవగాహనను పెంచడం, సమస్యలను పారదర్శకంగా వివరించి సలహాలు కోరడం, అందరూ భాగస్వాములనే భావాన్ని పెంచడం వంటివాటివల్ల నాయకుడు ఆదర్శంగా నిలుస్తాడు.

అలాగే, విని యోగదారులకు విలువలతో కూడిన సేవలందిస్తూ, సంస్థపట్ల విశ్వాసాన్ని పెంచడం, వారి సూచనలు, సలహాలు తీసుకోవడం, వ్వారితో వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవడం, సమయపాలన, నిబద్ధతల వల్ల వారిని ఆకర్షించడం సులువవుతుంది.

సింగరేణి సంస్థలో ఏపీవీయన్ శర్మ ఈ రకమైన విధానాలను అనుసరించడం వల్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారులలో నమ్మకాన్ని పెంచుతూ పర స్పర సంబంధాలను మెరుగుపరచ గలిగారు. అభిప్రాయ భేదాలను సకాలంలో పరిష్కరించడంతో ఘర్షణలు, ప్రతిఘటనలను నివారించారు. నిరంతర సమీక్షలు, పర్యవేక్షణలవల్ల అవసరమైన మార్పులు చేర్పులు చేశారు.

సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వారి సలహా లను సూచనలను ఆమోదించడం, వ్యర్థాలను నియంత్రించడం, నిరర్ధక ఆస్తులను వదిలించుకోవడం, కొత్త సాంకేతిక విధానాన్ని అమలు పరచడం, ఉద్యోగులకు పని స్థలాలలో సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యలవల్ల నష్టాల ఊబిలో దిగబడిన ఆ సంస్థ గత పాతిక సంవత్సరాలుగా ఉన్నత శ్రేణి ఫలితాలు సాధిస్తూ, పారిశ్రామిక రంగంలో ఆదర్శప్రాయంగా నిలిచింది.

అధికారికంగా కాకుండా లాలనతో అర్థమయ్యే విధంగా భావాలను పంచుకోగలిగిన నాయకులెవరైనా విజయసాధకులవుతారు. ఆదర్శప్రాయులూ కాగలరు. నాయకుని సముచితమైన దృఢ నిర్ణయాలే సంస్థను నిలబెడుతాయి.