సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది. వివిధ పథకాలు, ఇతర ప్రోత్సాహకాల అమలుకు ఈ సంస్థ నుండి నిధులను ఉపయోగించుకోవడానికి ఏ పార్టీ ప్రభుత్వమైనా వెనుకాడడం లేదు. కానీ, ఈ సంస్థకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం ‘ఉచిత అపరిమిత వైద్య సౌకర్యాలు’ కల్పించేందుకు ఎందుకో వెనుకాడుతున్నాయి. వారు చాలీ చాలని పెన్షన్‌తో దుర్భర జీవితం గడుపుతున్నారు. బొగ్గు గనులలో పని చేసే సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పాటుపడుతుంటారు. ఇందుకు తగిన ఫలాలను ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు పొందుతున్నారు. కానీ, అసలు సమస్య ఉద్యోగ విరమణ తర్వాత తెలుస్తున్నది. శేష జీవితాన్ని వారు అతి కష్టంగా గడప వలసి రావడం బాధాకరం.
సంస్థలో పని చేసినప్పుడు ఎదురైన ప్రమాదాల బారిన పడటమే కాక కాలుష్య వాతావరణంలో అనారోగ్యంతో జీవనం గడిపిన పర్యవసానం రిటైరైన తర్వాత కూడా అనుభవించవలసి వస్తున్నది. ‘కోల్ ఇండియా’లో ఇస్తున్న మాదిరిగా ‘సీపీఆర్‌ఎంఎస్’ ఎనిమిది లక్షలు పెరుగుతున్న వైద్య ఖర్చులకు ఎందుకూ సరిపోవడం లేదు. క్రిటికల్ రోగాలకు ఉచిత వైద్య సౌకర్యాలకు సంబంధించిన సర్క్యులర్ ఇంతవరకు కూడా వెలువడలేదు. దీనికితోడు పదవీ విరమణ పొందిన వారికి ‘సింగరేణి ఏరియా’ హాస్పిటల్స్‌లో ఇన్ పేషెంట్ సౌకర్యం తీసివేశారు. ఫలితంగా ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ అయింది. వివిధ పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు, రైల్వేలు తమ రిటైర్డ్ ఉద్యోగులకు విస్తృతంగా వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇదే పద్ధతిలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకూ తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రస్తుత ప్రభుత్వానికి వారు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
దండంరాజు రాంచందర్‌రావు, హైదరాబాద్