calender_icon.png 27 November, 2024 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార పదార్థాలు నాణ్యత లేకుంటే తిరిగి పంపించాలి..

23-11-2024 03:42:34 PM

జిల్లా కేంద్రం లోని పలు వసతి గృహల పరిశీలన 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి) : వసతి గృహాలకు సరఫరా అయ్యే బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు నాణ్యత లేకుంటే తిరిగి పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  శనివారం ఉదయం వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ కళాశాల వసతి గృహాన్ని, ఐజయ్య కాలనీలోని ప్రభుత్వ షెడ్యూల్డు కులముల బాలుర వసతి గృహం, కళాశాల వసతి గృహాలను సందర్శించారు. ప్రతి వసతి గృహంలో  బాధ్యత గల  ఫుడ్ సూపర్వైజర్,  విద్యార్థుల మెస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పిల్లలకు వండిపెట్టే  బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను కలక్టర్  పరిశీలించారు.  ఆహార పదార్థాలు వచ్చినప్పుడు మెస్ కమిటీ సభ్యుల సంతకాలు రిజిస్టర్లో  తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజి పడొద్దన్నారు. బియ్యం కానీ కూరగాయలు బాగు లేకుంటే తిరిగి పంపించాలని సూచించారు. 

పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, ప్లేట్లు, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కునే విధంగా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు.  స్టాక్ రిజిస్టర్,  డైలి రిజిస్టరు ఖచ్చితంగా నిర్వహించాలని వాటిలో ఫుడ్ సూపర్వైజర్ తో పాటు మెస్ కమిటీ సభ్యుల సంతకాలు ఉండాలని ఆదేశించారు. రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం పై కలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం ఫిల్టర్ నీళ్ళతో ఒకసారి కడిగి వండాలని శుభ్రత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు.  ఆహార నాణ్యత బాధ్యతను ఫుడ్ సూపర్వైజర్ చూసుకోవాలని, తేడా వస్తె బాధ్యత వహించాలని ఆదేశించారు. ఎస్సి బాలుర కళాశాల వసతి గృహ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.  ఏమైనా సమస్యలు ఉన్నాయా, భోజనం బాగుంటుందా అని విద్యార్థులతో ఆరా తీశారు. భోజనం బాగుందని, భోజనశాల లేకపోవడం వల్ల ఆరుబయట భోజనం చేయాల్సి వస్తుందని కలక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, డి.సి. ఒ. తిరుపతయ్య, మన్నాన్,  ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ రాజు తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.