42 కోట్ల పెట్టుబడికి ఎంవోయూ
రాబోయే ఐదేండ్లలో స్టార్టప్‌ల్లో మరో రూ.839 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన సత్ఫలితాలనిస్తున్నది. మహిళా పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ పెట్టుబడులకు సిద్ధపడింది. ఐదేండ్లలో వీహబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఐదేళ్లలో వీహబ్‌తోపాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్‌ల్లో దాదాపు రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్‌లు వీ సీఈవో సీతా పల్లాచొల్లా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను సీఎం, మంత్రి అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెపుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలగిస్తుందని సీఎం అన్నారు. గ్రెగ్ వాల్ష్ మాట్లాడు తూ.. పెట్టుబడులతోపాటు పట్టణాల్లో, గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు.
ఫణి కర్రా మాట్లాడుతూ.. ఉస్మానియా లో చదువుకున్న తనకు దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తంచేశారు. సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాములు రూపొందించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.