12-04-2025 11:01:18 AM
ఆదివాసి సంఘం పేరిట ముద్రణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలోని చింతలమానపల్లి, బెజ్జూర్ మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు దర్శనమివ్వడం చర్చకు దారితీసింది. కర్రెగుట్ట పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ.. వాల్ పోస్టర్లను ముద్రించారు. ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం... మావోయిస్టులారా తీరవా... మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం...? ఇందుకోసమేనా మీ పోరాటం..? అంటూ ఆదివాసి యువజన సంఘం, తెలంగాణ రాష్ట్రం(Telangana State) పేరిట వాల్పోస్టర్లను అంటించడంతో కలకలం రేపింది. చింతలమానపల్లి మండలం కర్జవేల్లి , బెజ్జూరు మండల కేంద్రంలో వాల్ పోస్టర్లను అంటించడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వాల్ పోస్టర్లు అంటించడంతో పోలీసులు అలర్ట్(Police alert) అయ్యారు. ఆదివాసి యువజన సంఘం పేరున వాల్పోస్టర్లను అంటించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదివాసి సంఘం పేరిట మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీస్ శాఖ అప్రమత్తమై ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెంచారు. మావోయిస్టు లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఆదివాసి సంఘం నాయకులు వాల్పోస్టర్లను అంటించారా లేదా ఇంకా ఎవరైనా ఇలాంటి పని చేశారా అనే దానిపై పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిమగ్నమయ్యారు. కర్రెగుట్టలో మందు పాత్ర పేలుడు జరిగి చాలా రోజులు అయినప్పటికీ ఇప్పుడు వాల్ పోస్టర్లు పెట్టి మావోయిస్టులకు సవాల్ విసిరడంపై చర్చనీయాంశం అయింది.