05-04-2025 02:09:46 AM
ఇప్పటికే ఐదుగురు నేతల రాజీనామా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న ప్రతిపక్షాలకు పెద్దలసభలోనూ చుక్కెదురైంది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. దీంతో బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లు జేడీయూలో చీలిక తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పార్టీ వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడం జీర్ణించుకోలేని కొందరు నేతలు రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే అలా రాజీనామా చేసిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది.
రాజీనామా చేసిన ఐదుగురూ సీనియర్లే కావడం గమనార్హం. జేడీయూ మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీ మాలిక్, స్టేట్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ, భోజ్‌పూర్‌కు చెందిన దిల్షాన్, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ తబ్రేజ్, మొదలైన వారు రాజీనామా సమర్పించిన వారిలో ఉన్నారు. వీరంతా బిల్లుపై పార్టీ తీరును తప్పుబడుతూ రాజీనామా సమర్పించారు.