calender_icon.png 17 January, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణలో వక్ఫ్‌భూమి

06-08-2024 01:56:07 AM

  • రాష్ట్రంలో వివాదాల్లో 57 వేల ఎకరాలు.. ఆధీనంలో కేవలం 20 వేల ఎకరాలు
  • వచ్చే వారం పార్లమెంట్‌లోకి వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు
  • ఆస్తులు, భూముల పత్రాలు తప్పనిసరి చేసే అవకాశం
  • మహిళలకు ప్రాతినిధ్యం!

క్రాంతి మల్లాడి

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): వక్ఫ్‌బోర్డు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత కోసం 1995 నాటి వక్ఫ్‌బోర్డు చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయనున్నది. దీనిలో భాగంగా వచ్చే వారం పార్లమెంట్‌లో వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. బిల్లు ద్వారా వక్ఫ్‌బోర్డులో మహిళల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వక్ఫ్‌బోర్డు చట్టానికి సంబంధించి 40 సవర ణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సవరణలో భాగంగా బోర్డు ఆస్తుల విషయంలో కూడా కీలక నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తోంది. బోర్డుకు సంబంధించి న ఆస్తుల వివరాలను కచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించనున్నట్టు సమాచారం. ఆస్తులు, భూములకు సంబంధించి సరైన పత్రాలు లేకపోతే వాటిపై వక్ఫ్‌బోర్డుకు ఉన్న హక్కులు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 

రైల్వే, డిఫెన్స్ తర్వాత వక్ఫ్‌బోర్డు వద్దే ఎక్కువ ఆస్తులు

దేశంలో రైల్వే బోర్డు, డిఫెన్స్ శాఖల తర్వాత అత్యధిక ఆస్తులు, భూములు వక్ఫ్‌బోర్డు దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 30 వక్ఫ్‌బోర్డులు ఉన్నాయి. వాటి ఆధీనంలో 8,72,292 ఆస్తులు, 9.40 లక్షల ఎకరాల భూమి ఉన్న ది.

ఈ ఆస్తుల ద్వారా లీజు, రెంట్ల రూపంలో రూ.200 కోట్ల ఆదాయం వస్తుంది. వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్న ఆస్తులకు, వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతన లేకుండా ఉండటంతో ఆయా ఆస్తులు, భూముల వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలోనే 77,538 ఎకరాల భూమి

అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుండటంతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు సందిగ్ధంలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్‌బోర్డుకు 33,939 సంస్థ లు, 77,538.07 ఎకరాల భూములు ఉన్నాయి. వాటి లో ప్రస్తుతం 20,114.16 ఎకరాల భూమి మాత్రమే వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉంది. మిగిలిన 57,423.91 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సంబంధిత అధికా రులు చెప్తున్నారు.

ప్రస్తుతం ఆక్రమణకు గురైనట్టు చెప్తున్న భూములు చాలావరకు ప్రైవేటు వ్యక్తుల పేరిట, మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖలతో కోర్టు కేసుల్లో ఉన్నాయి. అయితే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లులో ఆస్తు లు, భూములకు సంబంధించిన పత్రాలు తప్పనిసరి చేస్తే ఆక్రమణకు గురయ్యాయని చెప్తున్న భూములపై వక్ఫ్‌బోర్డు హక్కులు కోల్పోనుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మా భూములను వదులుకోం 

రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. రెవెన్యూ రికార్డులు పరిశీలించి సదరు వ్యక్తులపై ఉన్న సేల్ డీడ్ రద్దు చేయిస్తాం. వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన భూములను వదులుకునేందుకు మేము సిద్ధంగా లేము. బోర్డుకు సం బంధించిన భూములనే మేము అడుగుతున్నాం.

కేంద్ర ప్రభుత్వం కావాలనే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెడుతుంది. వక్ఫ్‌బోర్డు భూములను గుంజుకోవాలని చూస్తున్నది. మాకు హక్కు గా వచ్చిన భూములను వదిలే ప్రసక్తే లేదు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టగానే తెలంగాణ వక్ఫ్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. 


 సయ్యద్ అజ్మత్ హుస్సేని, 

తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్