calender_icon.png 1 January, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేటెడ్ కోసం నిరీక్షణ

30-12-2024 01:26:01 AM

  1. మంత్రులపై ఆశావహుల ఒత్తిడి 
  2. సమన్వయ లోపంతో తేలని పదవుల పందారం 

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరుత్సాహంతో ఉన్నారు. ఆశావహు  జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు కూడా తన అనుయాయులుకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది. ముగ్గురు మం  మధ్య సరైన సమన్వయం లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. 

మార్కెట్ కమిటీలపై ఆశలు

జిల్లాలోని 8 మార్కెట్ కమిటీల్లో మద్దులపల్లి, సత్తుపల్లి, కల్లూరు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీలకు మాత్రమే పాలకవర్గాలను నియమించారు. ఇంకా ఖమ్మం, వైరా, ఏన్కూరు, మధిర మార్కెట్ కమిటీలకు నియామకాలు జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్ కమిటీలు ఉండగా, ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట మార్కెట్ కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి.

కొత్తగూడెం, చర్ల, బూర్గంపాడు కమిటీలకు పాలకవర్గాలు నియమించలేదు. జిల్లాలో 600కు పైగా దేవాలయాలు ఉండగా ఏడాది కాలంలో ఒక్క ఆలయ కమిటీని కూడా నియమించలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ల నియామకం కూడా జరగలేదు.

ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు మధ్య సమన్వయంతో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వారి  మధ్య సమన్వయం కుదరకపోవడంతో పదవుల భర్తీ ఏడాదిగా పెండింగ్‌లో పడిందని తెలుస్తున్నది. 

ఏడాది కాలంగా ప్రయత్నాలు

భద్రాచలం ఆలయ చైర్మన్ పదవి కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర పోటీ నెలకొన్నది. అలాగే స్తంభాద్రి అర్బన్ డెవలప్  అథారిటీ (సుడా) చైర్మన్, డైరెక్టర్ల పదవులు కోసం ఆశావహులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరుడు చైర్మన్ మువ్వా విజయబాబుకు ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా ఉన్న రాయల నాగేశ్వరరావుకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. భట్టి విక్రమార్క అనుచరుడు నాయుడు సత్యనారాయణకు రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ పదవి దక్కింది.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. అయితే ఇంకా పార్టీ సీనియర్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం ఏడాదికాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.