calender_icon.png 26 January, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కోసం ఎదురుచూస్తున్నారు..

14-08-2024 12:05:00 AM

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండింటినీ జోడెడ్ల బండిలా కొనసాగిస్తోంది నటి, ఎంపీ కంగనా రనౌత్. సమయానుకూలంగా తాను ఏది ముఖ్యమనుకుంటుందో దానికే ప్రాధాన్యమిస్తానని చెప్తున్న ఈ సీనియర్ నటి లీడ్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీనే ‘ఎమర్జెన్సీ’. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలకు తెర తీసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న (నేడు) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. “పార్లమెంటేరియన్‌గా ఉండటం నిజంగా సవాల్‌తో కూడుకున్న ఉద్యోగమే. ప్రజాప్రతినిధిగా సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మండి నియోజకవర్గంలో సహజంగానే వరదలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని వరద తాకిడి అధికంగా ప్రాంతాలపై పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటా.

ఎంపీగా ఎన్నికైన తర్వాత బాధ్యతలు పెరిగాయి. రాజకీయ విధులను నిర్వర్తించేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నందున నా సినీ జీవితంపై ప్రభావం చూపుతోంది. నేను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మేకర్స్ నా కోసం ఎదురుచూస్తున్నారు. షూటింగ్‌లు ప్రారంభించ లేని పరిస్థితి నెలకొంది. రాబోయే పార్లమెంట్ సమావేశాలకు కూడా ఇప్పట్నుంచే సిద్ధం కావాలి.. అలా నా డేట్స్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది” అని చెప్పుకొ చ్చింది కంగనా.