- జేఎన్‌టీయూహెచ్ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరీక్షణ
- వేతనాలు పెంచుతూ ఇచ్చిన జీవో పూర్తిగా అమలుకావడం లేదని ఆవేదన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ ల్లో మాదిరిగా తమకు కూడా ఇంక్రిమెంట్లు, ఏరియర్స్ అమలు చేయాలని కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్ కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకు లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో, తాత్కాలిక ఉపశమనంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు రూ.43,470 వేతనం అమలు చేయాలని పేర్కొంటూ యూనివర్సిటీలకు 2018 ఏప్రిల్ 18న జీవో 11ను జారీ చేసింది. జీవో విడుదలైన కొన్ని నెలల్లోనే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అమలు చేసినప్పటికీ జేఎన్‌టీయూహెచ్‌లో మాత్రం 2022లో అమలు చేశారు.
ఈ జీవో ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులకు వారు సర్వీస్‌లో జాయిన్ అయిన దగ్గరి నుంచి ఎక్స్‌పీరియన్స్‌కు తగ్గట్టుగా ప్రతి సంవత్సరం రూ.1300 ఇంక్రిమెంట్ అమలు చేయాలి. కానీ అలా చేయకపోవడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 11 ప్రకారం అన్ని యూనివర్సిటీల్లో కనీస వేతనం, ఇంక్రిమెంట్లు అమలు చేస్తున్నప్పటికీ, జేఎన్‌టీయూహెచ్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు అమలు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కాగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుల కనీస వేతనాల కోసం కూడా 2022లో ప్రభుత్వం జీవో 141ని అమలు చేసింది. దీన్ని కూడా జేఎన్‌టీయూహెచ్ అధికారులు విస్మరించ డం గమనార్హం. జీవోలను అమలు చేయాలని, ఇంక్రిమెంట్స్, ఏరియర్స్ ఇవ్వాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాబోయే వీసీ దగ్గర తేల్చుకోవాలని..
ప్రభుత్వం జీవో 11, జీవో 141లను ఇచ్చినప్పటికీ జేఎన్‌టీయూహెచ్‌లో వాటిని అమలు చేయడానికి దాదాపు రెండేళ్లు సమ యం పట్టిందనే ఆరోపణలున్నాయి. ఈ జీవోల ప్రకారం అధ్యాపకులకు కనీస వేత నం రూ. 43,740 మాత్రం చెల్లిస్తున్నారు. కానీ ఇంక్రిమెంట్లను అమలు చేయడం లేదు. కారణంగా జేఎన్‌టీయూహెచ్, అనుబంధ కాలేజీల్లోని 250 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ లేరని.. కొత్త వీసీ వచ్చాక ఈ విషయం తేల్చుకోవాలని వారు ఉచిత సలహాలిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల గత వీసీ నర్సింహారెడ్డి తన పదవి కాలం చివరిరోజు ఆర్డర్ ఇచ్చినప్పటికీ, దానిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు కాని వారు పలువురు ఉండడంతో ప్రస్తుత ఇన్‌చార్జ్ వీసీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆ ఆర్డర్‌ను నిలిపివేసినట్లు యూనివర్సిటీలో చర్చ సాగుతోంది. దీంతో ఇంక్రిమెంట్లు, ఏరియర్స్ రాకపోవడం వల్ల ప్రతి నెల రూ.15 వేల నుంచి రూ.20 వేలు నష్టపోతున్నామని కాంట్రాక్ట్ అధ్యాపకులు వాపోతున్నారు.
ఇంక్రిమెంట్లు అమలు చేయాలి
ప్రభుత్వం నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ, నెట్, సెట్, ఎస్‌ఎల్‌ఈటీ అర్హతలున్న వారు కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. జీవో 11, జీవో 141 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులకు 2022 నుంచి మాత్రమే ఇంక్రిమెంట్లు అమలు చేస్తున్నారు. కానీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అన్ని సంవత్సరాలకు చెల్లించడం లేదు. గత వీసీ నర్సింహారెడ్డి తన పదవి కాలం ముగిసే చివరిరోజు ఇంక్రిమెంట్లు, ఏరియర్స్ అమలు కావాలని ఆర్డర్ ఇచ్చినప్పటికీ అది అమలు కావడం లేదు. మా సమస్యలపై ఇన్‌చార్జ్ వీసీ దృష్టి సారించి న్యాయం చేయాలి.
డా.బీ రాజేశ్‌ఖన్నా, కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు, జేఎన్‌టీయూహెచ్