calender_icon.png 26 December, 2024 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలధన రుణానికి ఎదురుచూపు

26-12-2024 02:11:27 AM

  1. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని కేంద్రం
  2. కేంద్రం విధించిన షరతులే అడ్డంకిగా మారాయా?
  3. 2024 బడ్జెట్‌లో వడ్డీలేని రుణాలకు రూ.1.5లక్షల కోట్ల ప్రతిపాదన
  4. ఏప్రిల్ మధ్య రూ.50వేల కోట్లు విడుదల 
  5. ఈ పథకంతో లబ్ధిపొందిన 23 రాష్ట్రాలు 
  6. జాబితాలో తెలంగాణకు దక్కని చోటు

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే మూలధన పెట్టుబడి రుణాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23 రాష్ట్రాలకు మూలధన రుణాలను ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల మూలధన వ్యయాలను పెంచేందుకు 2024 బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ రుణాల కోసం కేంద్రం రూ.1.5లక్షల కోట్లను ప్రతిపాదించింది. కాగా 23 రాష్ట్రాలకు రూ.50,571 కోట్లను ఏప్రిల్ మధ్య కాలంలో కేంద్రం విడుదల చేయగా.. ఆ జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు.

ఈ స్కీమ్ కింద రుణాలు పొందాలనుకునే రాష్ట్రాలకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. కేంద్రం నిర్దేశించిన రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాలకే ఈ స్కీమ్ కింద అప్పులు ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఆయా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చినా కేంద్రం సంతృప్తి చెందకపోవడం వల్లే రాష్ట్రం రుణాలకు నోచుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

‘మూలధన’ రుణాలు అంటే?

అభివృద్ధికి చేసే ఖర్చునే మూలధన వ్యయం అంటారు. రాష్ట్రాల్లో మూలధన వ్యయాలను పెంచడానికి కేంద్రం ‘స్పెషల్ అసిస్టెన్సీ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ స్కీమ్ కింద రాష్ట్రాలకు రుణాలను ఇస్తుంది. ఈ అప్పులను గరిష్ఠంగా 50ఏళ్ల కాల వ్యవధితో మంజూరు చేస్తుంది.

ఈ రుణాలకు వడ్డీ మినహాయిలుంపులు కూడా ఉండటం వల్ల రాష్ట్రాలకు వడ్డీ భారం తగ్గుతుంది. ఈ ప్రోగ్రాం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని కేటాయిస్తుం ది. 2023-24లో ఈ స్కీమ్ కోసం రూ.1.3లక్షల కోట్లను కేటాయించిన కేంద్రం.. 2024 రూ.1.5లక్షల కోట్లకు పెంచింది.

తీవ్ర ఆర్థిక కష్టాల్లో 

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో రూపాయి రూపాయి కూడబెట్టి.. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నెలకు రూ.వేలకు వేల వడ్డీలు కడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ఇచ్చే వడ్డీలేని రుణాలు చాలా ఉపయోగపడనున్నాయి.

ఈ రుణాలు రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం తగ్గిస్తాయని సర్కారు ఆశించింది. కానీ.. కేంద్రం మాత్రం షరతుల పేరుతో రాష్ట్రానికి  క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ రుణాలను ఇవ్వడంలో మొండి చేయి చూపిస్తోందన్న వాదనలు వినిపిపిస్తున్నాయి. 

రాబోయే మూడు నెలల్లో అయినా.. 

గృహ నిర్మాణ రంగం సంస్కరణలు, ప్రభుత్వ పాత వాహనాలు, అంబులెన్స్‌లను తొలగించడానికి ప్రోత్సాహకాలు, పట్టణ ప్రణాళికను మెరుగుపర్చడం, పోలీస్ సిబ్బందికి ఇళ్ల నిర్మాణం, పంచాయతీ, వార్డు స్థాయిలో పిల్లలు, యువకుల కోసం డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వంటి కేంద్రం నిర్దేశించిన అంశాల్లో సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాలకే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద అప్పు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

ఈ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కొక్కటిగా చేపడుతోంది. కానీ కేంద్రం మాత్రం ఏప్రిల్ మధ్యకాలంలో తెలంగాణకు రూపాయి కూడా విదిల్చలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద రుణాలను పొందేందుకు అవకాశం ఉన్న కొన్ని కీలక చర్యలు తీసుకున్నది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రంలో 213 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించింది.

అంతేకాకుండా, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏకంగా 25 కొత్త అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. రాబోయో రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల సమయమే ఉన్నది.

బడ్జెట్ ప్రతిపాదించిన నిధుల్లో ఇంకా దాదాపు 99వేల కోట్లు ఉండగా.. ఈ నిధుల్లో మున్ముందు అయినా కేంద్రం తెలంగాణకు క్యాపిటల్ రుణాలను ఇస్తుందా? మొండిచెయ్యి చూపుతుందా? అనేది తేలాల్సి ఉంది.