calender_icon.png 26 January, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ పిలుపుకోసం ఎదురుచూపు

03-07-2024 01:24:57 AM

  1. కాంగ్రెస్ పెద్దల ఆమోదం తర్వాతే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ 

క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జులై 2 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సామాజిక  సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అధిష్ఠానంతో చర్చించి తుదిరూపు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డితో సహా రాష్ట్ర ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అధిస్ఠానం నుంచి ఫోన్‌కోసం  సీఎం రేవంత్‌రెడ్డితో సహా పలువురు నేతలు  ఎదురు చూస్తున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చిన మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 6 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానుండటంతో.. ఆలోపే కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాలనే పట్టుదలతో  ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.

ఏఐసీసీ నుంచి బుధవారం పిలుపు వస్తే గురువారం అంటే 4న , లేదంటే 6వ తేదీన కూడా మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని చెబుతున్నారు. ఇప్పుడున్న అమాత్యుల శాఖల్లోనూ మార్పులు జరగొచ్చునని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గవర్నర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల భర్తీ, అసెంబ్లీ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి , ఇతర సీనియర్లు ఇటీవలనే ఢిల్లీలోనే మకాంవేసి మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు చేశారు. సామాజిక సమీకరణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమలకు ఒకటి, బీసీ, ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి ఒకటి చొప్పున మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుర్ లోక్‌సభ ఎన్నికల వేళ ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వరించే అవకా శం బలంగా కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి, మరొకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చే దిశలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి పక్కా అయ్యిం దని సమాచారం. ఉమ్మడి అదిలాబాద్ నుంచి ప్రాతినిథ్యం లేకపోవ డంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌వుకు అమాత్యయోగం పట్ట నుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లంబాడ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లితే.. వీరితో అధిష్ఠానం తుది చర్చలు జరపనున్నారు. మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.