calender_icon.png 31 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండ్రోజుల ముందే వేతనాలు

31-10-2024 01:14:17 AM

దీపావళి సందర్భంగా బల్దియా ఉద్యోగుల ఖాతాల్లో జమ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): దీపావళి పండుగ వేళ ఉద్యోగులకు, కార్మికులకు జీహెచ్‌ఎంసీ రెండ్రోజుల ముందే వేతనాలు విడుదల చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందుకోవడం అనేది ఇటీవల కాలంలో వారికి ఓ కలగా మారింది. బల్దియాకు రోజురోజుకూ అప్పులు భారమవుతుండగా, ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయం తప్పా మరే ఇతర ప్రత్యామ్నాయం లేకపోవడంతో జీహెచ్ ఎంసీ నిర్జీవంగా తయారవుతోంది. దీంతో ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేం దుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ దసరా పండుగ ఉన్నప్పటికీ సెప్టెంబర్ వేతనం 5వ తేదీన వేశారు. ఇదే నెలాఖరులో అక్టోబరు 31న దీపావళి ఉండగా, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బల్దియా అక్టోబర్ వేతనాన్ని నవంబర్ 1వ తేదీ కంటే ముందుగానే అందజేసి పండుగ పూట ఆనందంలో ముంచెత్తింది.

ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసి..

గ్రేటర్‌లో అన్ని రకాల ఉద్యోగులు, పెన్షన్‌దారులు కలిపి దాదాపు 30 వేల మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ.120 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ప్రతినెలా బల్దియా నిర్వహణకు దాదాపు రూ. 2 వేల కోట్లు అవసరమవుతుంది. వీటికి తోడు కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 1,450 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇదంతా ప్రతినెలా భారంగా మారుతోంది. సెప్టెంబర్ నెల వేతనాలు ఆలస్యంగా చెల్లించారనే మరకను తొలగించుకోవాలని భావించిన నేపథ్యంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ను రూ.100 కోట్లు వసూలు చేయాలని భావించింది.

2024 ఏడాదికి ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ రూ.2,100 కోట్లు కాగా, ఇప్పటికే రూ.1,260 కోట్లు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సిన రూ. 840 కోట్లలో రూ. 100 కోట్లను నాలుగు రోజుల్లో వసూలు చేయాలని భావించినా.. ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నాలుగు రోజుల్లో కేవలం రూ. 25 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈ నెల మొత్తం రూ. 67 కోట్లు మాత్రమే వసూలైంది. ఒక్క బుధవారం మాత్రమే సుమారు రూ.15 కోట్లు వసూలైనట్టుగా సమాచారం.

అయినా దీపావళి పండుగ ఉన్నందున గురువారం జీహెచ్‌ఎంసీ ఫైనాన్స్ అధికారులు బిల్లులు సబ్మిట్ అయిన ఆయా విభాగాలకు వేతనాలు జమ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే చాలా సెక్షన్లకు వేతనాలు జమ కాగా, బుధవారం రాత్రికల్లా పూర్తిస్థాయిలో ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది.