calender_icon.png 26 March, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలు మహాప్రభో...

24-03-2025 01:16:43 AM

3 నెలలుగా ఎదురు చూపులు...

ఆందోళనలో ఫీల్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు

మందమర్రి, మార్చి 23 : ఉపాధి అవకాశాల కోసం గ్రామాల నుంచి వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్ అసిస్టెంట్లు, పనులు చేస్తున్న ఉపాధి కూలీలు మూడు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 311 గ్రామ పంచాయతీల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నడుస్తున్నాయి. సుమారు 1,02,100  మంది జాబ్ కార్డు గ్రహీతలు ఉండగా ఇందులో సుమారు 82 వేల మంది జాబ్ కార్డు హోల్డర్లు పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు జిల్లాలో 180 మంది ఫీల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. 

మూడు నెలలుగా అందని వేతనాలు...

జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఫీల్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో వలసలు నివారించడంతో పాటు  స్థానికంగా ఉపాధి దొరుకుతుందని ఆశించిన కూలీలకు ఉపాది దొరకడం అటుంచితే, చేసిన పనులకు సంబంధించిన వేతనాలు సకాలంలో రాక కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో అప్పులు కూడా దొరకడం లేదని పలువురు వాపోతున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనులను కాదని స్థానికంగా దొరికే పనులకు వెళ్లాల్సి వస్తుందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లది కీలక పాత్ర అయినప్పటికీ...

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్ అసిస్టెంట్లది కీలకపాత్ర. గ్రామాల్లో పనులు గుర్తించి జాబ్ కార్డు హోల్డర్లకు పనులు అప్పగించడం, పనులకు వచ్చే వారికి హాజరు నమోదు చేయడం, పని ప్రదేశాల్లో వసతులు కల్పించడంలో ఫీల్ అసిస్టెంట్లది ప్రధాన బాధ్యత.

ఉపాధి హామీ పథకం విజయవంతం చేయడంలో ఫీల్ అసిస్టెంట్లు చురుకైన పాత్ర  పోషిస్తున్నప్పటికి వారికి నెల నెల రావాల్సిన వేతనాలు సకాలంలో రాక పోవడంతో వేతనాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామాల్లో నిరుపేద కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నప్పటికీ వేతనాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసినప్పటికీ ఉపాధి హామీ పథకం వంటి కీలక రంగంలో పనిచేస్తున్న ఫీల్ అసిస్టెంట్లకు, కూలీలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉండడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఉపాధి పనులతో క్షణం తీరిక లేకుండా...

ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో జాబ్ కార్డు హోల్దర్లకు ఉపాధి పనులు  కల్పిస్తు, చేపట్టిన పనులను పర్యవేక్షిస్తూ కూలీలతో విధులు నిర్వహించేలా చూడటంతో పాటు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను పర్యవేక్షిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయడంలో ఫీల్ అసిస్టెంట్లది కీలక పాత్ర.

చేపట్టిన అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకం అమలు, తదితర పనులతో క్షణం తీరిక లేకుండా ఒకవైపు విధులు నిర్వహిస్తునే మరోవైపు  గ్రామీణులకు ఉపాధి పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నప్పటికి వారికి వేతనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందుల నడుమ కుటుంబాలను పోషించాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పండుగ పూట ఆదుకోరు...

వేతనాలు రాకుంటే రానున్న తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన పస్తులుండాల్సిన దుస్థితి నెలకొననుంది. పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని ఫీల్ అసిస్టెంట్లు,  కూలీలు కోరుతున్నారు. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకునే ఉగాది పర్వదినం పురస్కరిం చుకొని ప్రభుత్వం వేతనాలు విడుదల చేసి తమను ఆదుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.

ఒకవైపు విద్యా సంవత్సరం ముగింపుకు రావడం ఇదే సందర్భంలో విద్యార్థుల ఫీజులు చెల్లింపు కోసం విద్యా సంస్థల ఒత్తిడి అధికం కావడం, ఇదే సందర్భంలో తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే ఉగాది పర్వదినం ఉండటంతో ఏమి చేయాలో పాలు పోవడం లేదని, ప్రభుత్వం ఆలోచించి తమకు రావాల్సిన మూడు నెలల వేతనాలు సకాలంలో విడుదల చేసి తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

వెంటనే వేతనాలు విడుదల చేయాలి

జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేతనాలు రాక  ఇబ్బందుల నడుమ కుటుంబాలను పోషించు కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆలోచించి ఉపాధి హామీ పథకం ఫీల్ అసిస్టెంట్ల వేతనాలు చెల్లించి ఇబ్బందులను తొలగించాలి.

 ఈద లింగయ్య. ఫీల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, మంచిర్యాల.

నెలనెలా జీతాలు చెల్లించాలి 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఫీల్ అసిస్టెంట్లు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. ప్రతి  నెల వేతనాలు రాక పోవడంతో గ్రామీణ పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తుంది. వీరందరికీ ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించి ఇబ్బందులను తొలగించాలి.

 శెట్టి సత్యనారాయణ, ఫీల్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షులు, మందమర్రి.