calender_icon.png 9 November, 2024 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రాల్లో వడ్లు.. తు కళ్లలో కన్నీళ్లు

09-11-2024 12:00:00 AM

  1. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంరాశులు
  2. 20 రోజులుగా రైతుల పడిగాపులు
  3. పొలాల నుంచి నేరుగా మిల్లులకు ధాన్యం తరలింపు

సిరిసిల్ల, నవంబర్ 8 (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు కష్టాలు తప్పడం లేదు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడంతో ధాన్యంరాశులు పేరుకుపోయాయి. దీంతో కొందరు రైతులు కల్లాల్లోనే వడ్లను ఉంచారు.

కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి ఇరువై రోజులు గడుస్తున్నప్పటికీ తూకం వేయడం లేదు. ఇప్పటికే ఆరబెట్టిన ధాన్యం రాశుల మీద రెండు వానలు పడ్డాయి. తడిసి ముద్దయిన ధాన్యం ఎండిపోయి తేమశాతం పూర్తిగా తగ్గిపోయింది. అయినప్పటికీ కొనుగోలు చేసేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో రైతులు  కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. 

సిరిసిల్ల జిల్లాలో 248 కేంద్రాలు

సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం 248 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా లక్షా 80 వేల 310 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద సేకరించేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. 248 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నింటిని మాత్ర మే ప్రారంభించారు. ప్రారంభించిన కేంద్రాల్లో తూకం వేయ డం మాత్రం నత్తనడకన సాగుతోంది. 

నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు

ప్రారంభంలో వరి కోతలు చేపట్టిన రైతులు ధాన్యం రాశులతో కేంద్రాల్లో పడిగాపులు పడుతుండటంతో ప్రస్తుతం వరి కోస్తున్న రైతులు ధాన్యాన్ని నేరుగా  పారా బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు రైతులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడ్‌కు రూ.2,320, బీ గ్రేడ్‌కు రూ.2,130 ప్రకటించింది.

మిల్లర్లు క్వింటాలుకు కేవలం రూ.1,810 నుంచి రూ.1,840 వరకే చెల్లిస్తున్నారు. అందులోనూ బస్తాకు కిలో తరుగు పేరిట దోచుకుంటున్నారు. వే బిల్లు పేరిట మరో రూ.100 కట్ చేసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతుల ధాన్యం తీసుకోబోమని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు నష్టపోతున్నా మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. 

మిల్లర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపం

మిల్లర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించడంతో మిల్లర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మొండికేశారు. సమస్యలను పరిష్కరించే వరకు మిల్లుల్లో ధాన్యం దించుకోమని పట్టుబట్టారు. ఎట్టి పరిస్థితిల్లో కేటాయించిన మిల్లుల్లో ధాన్యం దించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొంత జాప్యం జరిగింది. మిల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగే కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వ చర్చలతో విరమించుకున్నారు. మిల్లర్లు  ధాన్యం దించుకోవడంతో కొంత వరకు ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని కేంద్రాల్లో ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. 

20 రోజులైనా వడ్లు కొంటలేరు

నాకున్న ఎకరం భూమితో పాటు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశా. దిగుబడి మంచిగానే ఉంది. వడ్లు తీసుకుని కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం వచ్చాను. ఇప్పటి వరకు ఒక్క సారు కూడా రాలేదు. తేమ మొత్తం పూర్తిగా పోయినా కొంటలేరు. కేంద్రంలో వడ్లకుప్పలపై కప్పేందుకు కవర్లు లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. 

 తంగళ్లపల్లి లక్ష్మిరాజం, 

రైతు, రాంనగర్