calender_icon.png 30 October, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వదల బొమ్మాళీ వదల..

17-07-2024 05:51:30 AM

  • 27 ఏళ్లుగా నిజామాబాద్ మార్కెట్ కమిటీలో తిష్ఠ 
  • ప్రమోషన్ వచ్చినా.. బదిలీ చేసినా కదిలేదే లే 
  • మార్కెట్ లోటుపాట్లు తెలుసుకుని అక్రమార్జన? 

నిజామాబాద్, జూలై 16 (విజయక్రాంతి): నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఆయనో ఉద్యోగి. పేరుకు గ్రేడ్  సెక్రటరీ అయినా పెత్తనం అంతే ఆయనదే. ప్రమోషన్ ఇచ్చి వేరే చోటికి పంపినా, బదిలీ అయినా గత 27 ఏళ్ళుగా ఆయన ఇక్కడే డిప్యుటేషన్ మీద డ్యుటీలు చేస్తూ పర్మెనెంటుగా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. 27 ఏళ్ల అనుభవంతో మార్కెట్ లోటుపాట్లు తెలుసుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ పెద్దమొత్తంలో వెనకేసుకున్నాడు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో 1997లో ఎల్డీసీగా విధుల్లో చేరిన సదరు అధికారి ఇప్పుడు మార్కెట్ కమిటీనే శాసిస్తున్నాడు. మార్కెట్ కమిటికి చైర్మన్లు, గ్రేడ్ సెక్రటరీలు ఉన్నా నడిచేదంతా ఆయన మాటే.

2009లో కామారెడ్డి మార్కెట్ కమిటీకి బదిలీ అయిన అక్కడ చేరిన వెంటనే డిప్యుటేషన్‌పై నిజామాబాద్‌కు తిరిగి వచ్చాడు. 2010లో ప్రమోషన్ వచ్చినా ఇక్కడే కొనసాగారు. తిరిగి 2018లో అసిస్టెంట్ సెక్రటరీగా ప్రమోషన్ పొందారు. 2018లో హైదరాబాద్‌కు బదిలీ అయినా తన పలుకుబడిని ఉపయోగించి మళ్ళీ నిజామాబాద్‌కు డిప్యుటేషన్‌పై వచ్చారు. తిరిగి 2020లో గ్రేడ్ సెక్రటరీగా ప్రమోషన్ పొంది ఇక్కడే ఉన్నారు. 2023లో గ్రేడ్ సెక్రటరీగా ప్రమోషన్ పొందినా నిజామాబాద్‌ను మాత్రం వదిలేది లేదంటున్నాడు. 

అక్రమాలకు ఊతం

నిజామాబాద్ మార్కెట్ కమిటీ పసుపు పంట అమ్మకాలకు పెట్టింది పేరు. ఇక్కడ రైతులు తమ పంటకు సరైన ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం ఇలాంటి ఉద్యోగులు, వ్యాపారులు కుమ్మక్కవ్వడమే. పసుపు పంట అమ్మకాలు ఈ ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఎలక్ట్రానిక్ పద్దతిలో జరుగుతాయి. ఏ రైతుకైనా తన పంటకు ధర రాకపోతే ఆ లాట్‌ను తిరిగి వేలంపాట నిర్వహించాల్సి ఉండగా, ఆ పంటలో 30 శాతం పంటను జీరో కింద నేరుగా వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మి వ్యాపారులు, అధికారులు పంచుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని స్థానిక రైతులు డిమాండ్‌చేస్తున్నారు.

కమీషన్ ఏజెంట్లు చనిపోయిన ప్పుడు వారి లైసెన్సులు వారసులకు లేక పార్ట్‌నర్‌లకు మాత్రమే మార్పిడి చేయాల్సి ఉండగా, సదరు అధికారి వాటిని వారసత్వంతో నిమిత్తం లేకుండా ఇతరులకు మార్పిడి చేస్తు కోట్లలో గడిస్తున్నాడని బహిరంగంగానే ఆరోపణలు వినవస్తున్నాయి. హమాలీ దడ్వాయిల లైసెన్స్‌లు సైతం ఇదే విధంగా మార్పిడి చేస్తు  అక్రమార్జనకు తెగబడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ అధికారి నిజామాబాద్ యార్డుకు 25 ఏళ్ళుగా రెగ్యులర్ గ్రేడ్ సెక్రటరీలను రాకుండా తన పలుకుబడితో పైరవీలు చేస్తున్నాడు. యార్డును తన చెప్పుచేతుల్లో పెట్టుకుని తాను ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాడు. 

ఓ మాజీ చైర్మ న్ అండదండలతో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ, వారికి ఇవ్వాల్సింది ఇస్తు పట్టు నిలుపుకుంటున్నాడు. అతని ఆగడాలపై విచారణ జరపాలని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.