calender_icon.png 2 November, 2024 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాకుల సభ

27-04-2024 12:15:00 AM

కవి అయినప్పుడు, అనబడినప్పుడు, కవులన్న వారెవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా వెళ్లాలి కదా! మరీ, బొంబాయి వారు ఇక్కడికి వచ్చి పిలిస్తే పోకుంటే ఎట్లా?

ఆచార్య మసన చెన్నప్ప

ఆ సభకు మొదట వెళ్లకూడదనే భావించాను. కానీ, సభకు ఆహ్వానించిన వారు నాకు బంధువులు. బొం బాయి నుంచి వచ్చి హైదరాబాదులో సభ ను పెట్టినప్పుడు పోకపోతే ఏట్లా? బొంబాయికి వారెన్నోసార్లు  రమ్మన్నారు. వారు కవులు, కవితాగానం చేస్తారు. రెండు మూడు కవితా సంపుటాలు ప్రచురించారు. ప్రవాసాంధ్రులు కదా! అంత మాత్రం వారికి మర్యాద ఇవ్వకపోతే ఎట్లా? అందుకే, వారు హోటల్‌లో ఏర్పా టు చేసిన పుస్తకావిష్కరణ సభకు వెళ్లాను. నాకు సభా ధ్యక్ష స్థానాన్ని అప్పగించారు. నిజానికి అధ్యక్ష స్థానంలో ఉండవలసిన వారు లేరు. ఆహ్వాన పత్రంలో నలుగురి పేర్లే ఉన్నాయి. ముఖ్య అతిథి ఒకరు, గౌరవ అతిథి ఒకరు, పుస్తక సమీక్షకులు ఒకరు, రచయిత మరొకరు. సభాధ్యక్షుని పేరే లేదు అందులో. హోటల్‌లో పుస్తకావిష్కరణ. అది మూడవ అంతస్తు, సాయంత్రం 6 గంటలన్నారు గానీ, 7 గంటలైనా ఎవరూ లేరు. హోటల్ అంటే భోజనాలు వుంటాయి. ఎంత కాదన్నా డిన్నర్ తొమ్మిదికి కాని చేయనివ్వరు. అందుకేనేమో, పుస్తకావిష్కరణకు ఆహుతులు ఎనిమిందిటికిగాని రాలేదు. హోటల్ అనగానే చక్కగా ముస్తా బై వచ్చేవారు వుంటారు. ఒకరికి మరొకరు తోడుగా వచ్చేవారూ వుంటారు. కార్లలో వచ్చేవారు వుంటారు. ఎనిమిదికి సంయోజకుడు వేదికమీదికి ఆహూతులను పిలిచా డు. అందులో ఇద్దరు లేరు. ముఖ్య అతిథి అప్పటికీ రాలేదు. సమీక్షకుని జాడ లేనే లేదు. నేనూ, రచయిత ఇద్దరం మాత్రం సభలో ఉన్నాం. రచయిత లోపలి వాడు. నేను బయటివాణ్ణి. ఇద్దరం సభా వేదికను అలంకరించాం. అంతటితో సభ ఎట్లా మొదలౌతుంది? 

సంయోజకుడు సభలో ఉన్నవారిలో ఒక నలుగురిని వేదిక మీదకి ఆహ్వానించాడు. వారు ముందుగానే సభలో మాట్లా డటానికి సంసిద్ధులైనట్లు వుంది. కాగితాలు చేతిలో పట్టుకొని వేదికను అధిరోహించారు. మేం మొత్తం ఆరుగురమయ్యాం. సంయోజకుడు మంచి వ్యాఖ్యాతగా నిరూపించుకోవాలి కనుక, అతడు రచయిత గురించి పది నిమిషాలు అనర్గళంగా మాట్లాడినాడు. ఆ తరువాత తానూ మాట్లాడుతానని మరొక కవితా బంధువు, సాహిత్య సింధువు వేదిక మీదికి వచ్చాడు. రచయిత అతణ్ని సాదరంగా ఆహ్వానించాడు. అతనికి ‘ఏదో పని ఉండడం వల్ల ముందుగానే మాట్లాడడానికి అవకాశం ఇవ్వ’మన్నాడు. ముందుగా మాట్లాడడానికి అవకాశం లభించవచ్చుగాని, ముందు గా డిన్నర్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు కదా! 

అందరికంటే ముందు ఆ అయిదవ వ్యక్తి మాట్లాడినాడు. కవిత్వం అంటే చెవి కోసుకుంటాడట. తాను కవిని కాకపోయినా కవులను గౌరవిస్తున్నాడట. చిన్నత నంలో తాను కవియట. కానీ, తన అర్థాంగి చీవాట్లు పెట్టడం వల్ల కవిత్వం రాయడం మానేశాడట. ఐనా, ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా అక్కడికి వెళ్లి కవులతో తనకుగల పరిచయాన్ని తెలియజేస్తాడట. ఎట్లాగైతేనేమి, సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేను ఒక్క మాటకూడా అప్పటికి మాట్లాడలేదు. అయినా, సభ నడుస్తూనే ఉంది. డ్రైవర్ లేకుండా బస్సు నడిచినట్లు. రచయిత ఆ అయిదవ  మిత్రునికి తనకూ గల అనుబంధాన్ని తెలియజేస్తూ, అతణ్ణి శాలువతో సత్కరించి వీడ్కోలు పలికాడు. 

ఎట్లాగైతేనే, సభాధ్యక్షుని తొలి పలుకులు లేకుండానే సభ నడుస్తూ ఉంది. సభా వేదికను అలంకరించిన రచయితకూ, నాకు తోడుగా ఇంకో నలుగురు ఉన్నారు కదా! వారిలో ఒకరు ‘తనకు కవులంటే పడదని, కవిత్వాన్ని పెద్దగా ఇష్టప డనని, సినిమాలంటే ఇష్టమని, తాను కవిత్వాన్ని రాయడానికి ఎన్నడూ ప్రయత్నిం చలేదని’ ఏవేవో మాటలు చెప్పి కూర్చున్నాడు. రచయిత అతనికి శాలువా కప్పి సన్మానం చేశాడు. ఇంకా ముగ్గురు ఉన్నా రు. వారు రచయితకు తమకు ఉన్న బంధుత్వాన్ని గూర్చి ప్రసంగించారు. వారిలో ఒకరు రచయితకు క్లాస్‌మేట్ అట. రచయిత మొదటి నుంచే కవిత్వం చెప్పేవాడట. ‘తాను ఎంత ప్రయత్నించినా కాగితా లు సిరాతో నిండడమే గానీ, కవిత్వం చెప్పే అవకాశం రాలేదని’ నిరుత్సాహ పడ్డాడు.

కవిత్వం అందరికీ వస్తుందా? నేను ఎన్నడో కవిత్వం గురించి రాసిన పద్యం ఒకటి ఈ సందర్భంలో గుర్తుకు వచ్చింది.

“కలము కాగితమ్ము 

కరమున నున్నంత 

కవిత రాదు వట్టి కలత దప్ప

పాత్ర చేత నున్న పాలిచ్చునా గోవు

రమ్య గుణ సనాధ! రంగనాథ!!”

ఆ మిత్రునికి కూడా శాలువా కప్పి రచయిత అతణ్ణి సన్మానించాడు. రచయిత, నేను కాక మిగిలిన వక్తలు ఏవో విషయా లు ప్రస్తావించారు. ‘బొంబాయి కవులను తెలుగు ప్రాంతాల కవులు పట్టించుకోవాలని, బొంబాయికి వచ్చి తమ కవిత్వాన్ని వినిపించాలని’ సూచించారు. ‘తాము తెలుగంటే ఎంతో ఇష్టపడుతున్న వారమని, ముప్పయి ఏళ్ల క్రితమే ముంబా యికి వలస పోయిన వారమని’ ఎన్నో విషయాలు ప్రస్తావించారు. రచయిత వారిని ప్రేమ పూర్వకంగా శాలువాలు కప్పి సన్మానించాడు. వేదిక మీద మాట్లాడే వారిలో ఇంకా రచయితతోపాటు నేను మిగిలి ఉన్నాను. సంయోజకుడే సభను నడిపించడం వల్ల నాకు మాట్లాడే అవకాశం రాలేదు. అప్పటికీ ముఖ్య అతిథి జాడ లేదు. పుస్తక సమీక్షకుడు మాత్రం ఆదరా బాదరగా సభలోకి ప్రవేశించాడు. నగరంలో ఎక్కడో ట్రాఫిక్‌లో చిక్కి అదృష్టవశాత్తు హోటల్‌కు చేరినట్టుగా అనిపిం చింది, అతని వాలకం చూసినప్పుడు. సం యోజకుని ఆహ్వానం మేరకు సమీక్షకుడు చేతిలో కాగితాల కట్టతో ప్రవేశించాడు. 

నాకు భయం వేసింది, ‘ఆ కాగితాలన్నీ చదువుతాడా’ అని. సమీక్షకుడు మంచివా డే. తొమ్మిది కావొచ్చింది కనుక, అతనికి కూడా ఆకలై వుంటుంది. అందుకేనేమో, రాసుకొచ్చిన కాగితాలను పక్కన పెట్టి, రచయితను అభినందించాడు. ‘తాను సమీక్ష రాసి పత్రికకు పంపి ముద్రితమైన కాపీని రచయితకు అందజేస్తానని’ మాట కూడా ఇచ్చాడు. ‘బతుకు జీవుడా’ అని నేను ఊపిరి పీల్చుకున్నాను. రచయిత పుస్తక సమీక్షకుణ్ణి శాలువాతో సన్మానించి ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమీక్షకుడు ఎవరో కాదు, ఆయనకు వరుసకు సోదరుడు అవుతాడట. ఎట్లాగైతేనేమి, అందరి ప్రసంగాలై పోయాయి. ఇక నాకు మాట్లా డే అవకాశం వచ్చింది. పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు హోటల్లోకాక బయట సాహిత్య వేదికల మీద జరిగితే బాగుంటుందని ప్రస్తావిస్తూ, రచయితను గూర్చి, అతని కవితా పాటవం గురించి పది నిమిషాలు మాట్లాడినాను.

సభలో వున్నవారు అప్పటికే డీలా పడ్డారు. డిన్నర్ మీద వున్న దృష్టి కవి త్వం మీద లేదనిపించింది. చివరికి రచయిత సమాధానం ఇచ్చాడు. ‘ఎన్నాళ్ల నుం చో హైదరాబాద్‌లో తన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని ఉందని, అది నేటికి తీరింద’ని సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ అయిదు నిమిషాల్లో అతని ప్రసంగం ముగుస్తుందనుకున్నాను. కానీ, అలా జరగలేదు. అతని కార్యక్రమం కదా! ౩౦ నిమిషాలపాటు అతడు కవిత్వాన్ని ఎట్లా మొదలు పెట్టాడో వివరించాడు. విసుగు అనిపించినా దాన్ని నేను ప్రదర్శించకుండా ఉండి పోయాను. నాకు కూడా రచయిత సన్మా నం చేశాడు. అనంతరం అహూతులు రచయితను ఘనంగా సత్కరించారు.

ఇక, ఐదు నిమిషాల్లో సభ అయిపోతుందనగా ముఖ్య అతిథి సభలోకి ప్రవేశించాడు. ఇంకేముంది, కథ మొదటికి వచ్చింది. లేచిన వారు అందరూ తిరిగి కూర్చొన్నా రు. ముఖ్య అతిథి ఉరుకోలేదు. అరగంట సేపు కంఠశోషకు బలియై బయటపడ్డాడు. రచయిత ముఖ్య అతిథి వచ్చినందుకు ఎం తో సంబరపడి పోయాడు. ‘కార్యాంతరం వల్ల ఆలస్యమైందని’ ముఖ్యఅతిథి తెలియజేశాడు. ‘అతను రావడమే గొప్ప అదృ ష్టమని’ రచయిత సంతృప్తి పడ్డాడు. సభ జరిగిన తర్వాత ఎవరైనా ‘హోటల్లో పుస్తకావిష్కరణ సభ’ అంటే పోవడానికి భయ పడ్డాను. కానీ, కవి అయినప్పుడు, అనబడినప్పుడు, కవులన్న వారెవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా వెళ్లాలికదా!  బొంబాయి వారు వచ్చి పిలిస్తే పోకుంటే ఎట్లా?