- గత ప్రభుత్వ హయాంలో అందినకాడికి పెట్టుబడి సాయం గుంజిన అనర్హులు
- రాజకీయ నేతలు, అధికారుల సహకారం
- ఖమ్మం జిల్లాలో.. అడ్డదారిలో 15 వేల ఎకరాలకు పైగా..
- రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం
రియల్ ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, రాళ్ల గుట్టలు, మట్టిదిబ్బలు, మట్టి క్వారీలు, వడ్ల మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు, బీడు భూములు.. కావేవి రైతుబంధుకు అనర్హం అని కొందరు ఘనాపాటీలు నిరూపించారు. చక్కగా ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పొందారు. ‘రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆగం కావొద్దు.. సాఫీగా సాగు చేసుకోవాలి..’ అన్న సంకల్పంతో గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసిం ది.
తద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసింది. కానీ.. రాజకీయ నేతల ‘అండ దండలు’, అధికారుల ‘సహాయ సహకారాల’తో కొందరు సాగులో లేని భూములకు పట్టాలు చేయించుకున్నారు. వారి ఖాతాల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా జమ అయింది. ‘రైతుభరో సా’ అమలు కోసం ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో వెలుగులోకి వస్తున్న ఇలాంటి వాస్తవాలు ఎన్నో..
ఖమ్మం, జనవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రప్రభు త్వం ఈనెల 26 నుంచి ‘రైతుభరోసా’ అమలు చేయనున్న నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికా రులు ఈ నెల16 నుంచి ఖమ్మం జిల్లావ్యాప్తంగా యోగ్యత ఉన్న భూముల గుర్తింపునకు సర్వే చేపడుతున్నారు. ఈ సర్వేలో రైతుబంధు అక్రమాలు కుప్ప లు తెప్పలుగా బయటపడుతున్నాయి.
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సాగుకు పనికి రాని సుమారు 15 వేల ఎకరాలకు పైగానే రైతుబంధు పథకం వర్తించినట్లు సర్వేలో తేలింది. జిల్లాకేంద్రం సమీపంలోని రఘునాథపాలెం, బల్లేపల్లి, వి.వెంకటాయపాలెం, ధంసలాపు రం, అల్లీపురం, కొదుమూరు, ప్రకాశ్‌నగర్, ఇల్లెందు రోడ్, శ్రీనివాసనగర్, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లోనే సాగులో లేని 500 ఎకరాలకు పైగా ఈ పథకం వర్తించినట్లు సర్వేలో వెల్లడైంది.
ధంసలాపురం ప్రాంతంలో..
ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలోని ధంసలాపురం ప్రాంతంలో సాగులో లేని సుమారు 250 ఎకరాలకు పథకం వర్తించినట్లు అధికా రులు సర్వేలో గుర్తించారు. ఖమ్మం నగరం రోజురోజకూ తన పరిధులను విస్తరించుకుంటున్న క్రమంలో శివా రు గ్రామాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు వ్యవసాయ యోగ్యమైన వేలాది ఎకరాల భూములను కొందరు రియల్టర్ల కు విక్రయించారు. ఈ క్రమంలో ఆ భూములన్నీ సాగుకు పనికి రాని కన్వెర్టెడ్ భూములుగా మారాయి. ఆ వెంచర్లకు కూడా రైతుబంధు పథకం వర్తించడాన్ని తాజాగా అధికారులు గుర్తించారు.
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే ఎక్కువ..
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే ఎక్కువగా రైతుబంధు పథకం దుర్వినియోగం అయిందని అధికారులు సర్వేలు గుర్తించారు. ఖమ్మం నగర శివారులోని 20 ఎకరాల వెంచర్, ఇటుక బట్టీలు, మట్టిదిబ్బలు, క్వారీలకు పథకం వర్తించింది. ఈ లిస్ట్‌లో కల్యాణ మండపాలు, కోల్డ్ స్టోరేజీలు, వడ్ల మిల్లులు కూడా ఉండడంతో సర్వే అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలా ఖమ్మం చుట్టుప క్కల ప్రాంతాల్లోనే సాగులో లేని సుమారు 500 ఎకరాల భూములకు పథకం వర్తించిందంటే.. ఇక జిల్లావ్యాప్తంగా ఎంత ప్రజాధనం అనర్హుల ఖాతాల్లో జమ అయిందో ఇట్టే అంచ నా వేయొచ్చు. ఈ నేఫథ్యంలో ప్రభు త్వం పక్కాగా సర్వే చేపట్టి, సాగులో ఉన్న భూమలకే రైతుభరోసా వర్తింపజేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది.