- ఏటా లక్షకుపైగా మనుషుల మరణాలు
- ఈ పక్షుల అదృశ్యంతో పర్యావరణ సంక్షోభం
- తాజా అధ్యయనంలో వెలుగులోకి సంచలన విషయాలు
న్యూఢిల్లీ, జూలై 17: రాబందులు.. భారత్‌లో దాదాపు అంతరించిపోయాయి. 99.9 శాతం వరకు వీటి సంఖ్య క్షీణించింది. అయితే, ఈ ప్రభావం మానవుల ఆరోగ్యంపై పడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. రాబం దులు అంతరించిపోవడం వేలాది మంది మరణాలకు కారణమవుతోందని ఈ పరిశోధన గు ర్తించింది. రాబందులు అంతరించిపోవడం, మానవులపై దాని ప్రభావంపై ఆర్థికవేత్తలు ఏయల్ జీ ఫ్రాంక్, అనంత్ సుదర్శన్ చేసిన పరిశోధనలో కీలక అంశాలు వెలుగుచూశాయి.
భారత్‌లో రాబందుల సంఖ్య తగ్గడం వల్ల మానవుల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వారు పేర్కొన్నారు. వీరి అధ్యయనం ప్రకారం 1990లలో దేశంలో రాబందుల సంఖ్య భారీగా క్షీణించింది. రాబందులకు చెందిన అన్ని జాతుల్లో దాదాపు 99.9 శాతం వరకు అంతరించాయి. ఇందుకు కారణం పశువులకు చికిత్స కోసం విషపూరితమైన డైక్లోఫి నాక్ అనే వెటర్నరీ పెయిన్‌కిల్లర్‌ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల రాబందులు పెద్ద సంఖ్య లో మరణించాయి.
వేగంగా క్షీణత
భారతీయ రాబందు (శాస్త్రీయ నామం జిప్స్ ఇండికస్) అక్సిపిట్రిడే కుటుంబానికి చెందిన పెద్ద పక్షి. దీని శరీర పొడవు 75 నుంచి 85 సెం.మీ వరకు ఉంటుంది. వీటి రెక్కలు సుమారు 1.96 నుంచి 2.38 మీటర్ల విస్తీర్ణంతో ఉంటాయి. మాంసాన్ని తినేందుకు వీలుగా హుక్‌లా ఉండే ముక్కు ఉంటుంది. భారతీయ రాబందులు కుళ్లిన కళేబరాలు, చనిపోయిన జంతువుల మృతదేహాలను తిం టాయి. ఇలా పర్యావరణంలో వ్యర్థాలను రాబందులు శుభ్రం చేస్తాయి. భారతీయ రకం రాబందులు ప్రధానంగా భారత్, పాకిస్థాన్, నేపాల్ సహా దక్షిణాసియాలో.. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. ఈ పక్షులు సవన్నాలు, గడ్డి భూములు, పొడి ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్టపడుతాయి. వీటి సంతానోత్పత్తి కాలం మారుతూ ఉంటు ంది. కానీ ఎక్కువ శాతం నవంబర్ నుంచి మార్చి మధ్య ఉంటుంది. ఆడ, మగ పక్షులు కలిసి పొదుగుతాయి.
మానవులపై ప్రభావం ఎలా?
పశువుల చికిత్సలో డైక్లోఫినాక్ ప్రవేశపెట్టక ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఫ్రాంక్, అనంత్ బృందం పరిశోధించింది. వివిధ జిల్లాల్లో రాబందుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేయగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. రాబందులకు అనువైన ప్రాంతాల్లో అవి క్షీణించడం వల్ల 4 శాతం ఎక్కువ మరణాల రేటు పెరిగినట్లు గుర్తించారు. దాదాపు ఏటా లక్ష మంది చనిపోతున్నట్లు అధ్యయనం తెలిపింది. సాధారణంగా లక్షలాది పశువుల కళేబరాలను రాబందులు తింటాయి. తద్వారా భారత పర్యావరణ వ్యవస్థలో అవి కీలక పాత్ర పోషించేవి. వాటి అదృశ్యం పారిశుద్ధ్య సంక్షోభానికి దారి తీసింది. కుళ్లిన కళేబరాలు అలాగే ఉండటం, తద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడం, నీటి వనరులు కలుషితమయ్యేందుకు అవకాశం ఏర్పడింది.
అదే సమయంలో వీధి కుక్కుల సంఖ్య పెరగడం, ఇలాంటి కళేబరాలను అవి తినడం వల్ల రేబీస్ వ్యాప్తి ఎక్కువ అవుతోందని అధ్యయనం వెల్లడించింది. రాబందులు మానవులతో మచ్చికగా ఉండలేవు, కానీ కుక్కలు మన సమీపంలోనే ఉండటం వల్ల రేబీస్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి అవకాశం కల్పిస్తోందని అధ్యయనం తెలిపింది. అంతిమంగా ఈ పరిశోధన ప్రకృతిలో జీవవైవిధ్య ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. జాతుల నష్టం ద్వారా మానవులకు ముప్పు ఉంటుందని పేర్కొంటుంది. పర్యావరణంలో అన్ని జీవులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేస్తోంది. అందుకే అన్ని జీవ జాతులను రక్షించే బాధ్యత మానవులపై ఉందని చెబుతోంది.