calender_icon.png 21 December, 2024 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఆర్వో, వీఆర్‌ఏలు.. విలేజ్ పబ్లిక్ ఆఫీసర్‌లుగా!

16-10-2024 03:18:23 AM

రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం

జనాభా, భూ కమతాలు ఎక్కువ ఉన్న గ్రామాలకు ఇద్దరు వీపీఓల నియామకం

డిగ్రీ విద్యార్హతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదనలు

ఖాళీలుంటే టీజీపీఎస్సీ ద్వారా నియామకం!

2025 జనవరి నుంచి విధుల్లోకి ‘గ్రామ ప్రజా అధికారులు’

బూడిద సుధాకర్ :

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : తెలంగాణలో రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం రానుంది. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పునఃనిర్మాణం అవుతున్నది. ప్రజలకు, రైతులకు గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలను అందించాలనే సంకల్పంతో.. గత ప్రభుత్వం ఇతర శాఖలలో మెర్జ్‌చేసిన గ్రామ రెవెన్యూ అధికారులను, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత కొంతకాలంగా సీసీఎల్‌ఏ, సచివాలయ రెవెన్యూ విభాగాల అధికారులు చేస్తున్న కసరత్తు పూర్తయ్యింది. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘గ్రామ ప్రజా అధికారి’ (విలేజ్ పబ్లిక్ ఆఫీసర్)లుగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలను నియమించేందుకు రంగం సిద్ధమైంది. వీఆర్వో, వీఆర్‌ఏలకు బదులుగా సుమారు 20 రకాల పేర్లను పరిశీలించిన ప్రభుత్వం గ్రామ ప్రజా అధికారి పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

వచ్చే దీపావళి నాటికి వీఆర్వో, వీఆర్‌ఏలకు రెవెన్యూ శాఖలోకి తీసుకునే ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు 2025 జనవరి నుంచి గ్రామ సచివాలయంలో గ్రామ ప్రజా అధికారులు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇందుకు సంబంధించి ఈ నెలాఖరుకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందని ప్రభుత్వంలోని ఓ అత్యున్నతస్థాయి అధికారి ‘విజయక్రాంతి’కి తెలిపారు. వివిద శాఖల్లో మెర్జ్ అయిన వీఆర్వోల, వీఆర్‌ఏల వివరాలపై సీసీఎల్‌ఏ, సచివాలయ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం ప్రతి గ్రామానికి రెవెన్యూ గ్రామానికి ఇక గ్రామ ప్రజా అధికారిని నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాలు 10,954 

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు, 12,769 గ్రామ  పంచాయతీలున్నాయి. అయితే రెవెన్యూ గ్రామాలు మాత్రం 10,954 ఉన్నాయి. అయితే రాష్ట్రంలో వివిధ శాఖలలో మెర్జ్ అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు మొత్తం 25,750 మంది ఉన్నారు.

వీరిలో వీఆర్‌ఏలు 20,555 మంది ఉండగా, వీరిలో డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు 3,680 మంది, ఇంటర్మీడియట్  విద్యార్హతలున్న వారు 2,761 మంది, పదవ తరగతి విద్యార్హతలున్న వారు 10,347 మంది, 61 సంవత్సరాల వయసు దాటిన వారు 3,767 మంది ఉన్నారు. అలాగే ఇంటర్, డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన వీఆర్వోలు 5,195 మంది ఉన్నారు.

అయితే మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 23 శాతం మేజర్ రెవెన్యూ గ్రామాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మేజర్ గ్రామ పంచాయతీ/ పెద్ద రెవెన్యూ గ్రామాలలో నివాసం ఉంటున్న జనాభాతోపాటు భూ కమతాలు ఎక్కువగా ఉన్న మేజర్ రెవెన్యూ పంచాయతీలకు ఇద్దరు గ్రామ ప్రజా అధికారులను నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

ఈ క్రమంలోనే మొత్తం 25,750 మంది వీఆర్వో, వీఆర్‌ఏలలో 10,954 గ్రామాలలో సుమారు 16,700 మంది అధికారులను గ్రామ ప్రజా అధికారులుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. 

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై నజర్?

ప్రభుత్వం మొదట డిగ్రీ, ఆపై విద్యార్హతలు ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏలనే గ్రామ ప్రజా అధికారులుగా తీసుకోవాలని భావించింది. ఇందులో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల విద్యార్హతల వివరాలను సేకరించిన సీసీఎల్‌ఏ ద్వారా సచివాలయ రెవెన్యూ విభాగం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

అయితే గ్రామ ప్రజా అధికారులుగా సుమారు 16,700 మంది అవసరం కాగా, వీఆర్వోలలో, వీఆర్‌ఏలలో డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్నవారు అంతమంది లేరు. అలాగే వీరిలో వివిధ శాఖలలో ముఖ్యంగా మున్సిపల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్ శాఖలో మెర్జ్ అయిన వీఆర్వో, వీఆర్‌ఏలలో కొంతమంది మళ్లీ రెవెన్యూ శాఖకు వచ్చేందుకు సుముఖంగా లేరు.

ఈ క్రమంలోనే డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారిని ప్రస్తుతం గ్రామ ప్రజా అధికారులుగా తీసుకొని, మిగిలిన వారిని టీజీపీఎస్సీ ద్వారా నోటీఫికేషన్ జారీచేసి గ్రామ ప్రజా అధికారులుగా నియామకం చేసుకోవాలనే ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది.

అయితే ఈ నెలాఖరునాటికి ప్రభుత్వం గ్రామ ప్రజా అధికారుల విద్యార్హతలపై తుది నిర్ణయం తీసుకుంటుందని, అలాగే టీజీపీఎస్సీ ద్వారా నియామకం చేయనున్న పోస్టులపై స్పష్టత ఇస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే దీపావళి వరకు గ్రామ ప్రజా అధికారుల నియామకం ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు 2025 జనవరి నుంచి ప్రతి గ్రామంలో గ్రామ ప్రజా అధికారి ప్రజలకు సేవలు అందించేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసిందని ఆ అధికారి తెలిపారు.   

వీపీఓలకు సర్వాధికారాలు

గ్రామస్థాయిలో ప్రజలకు అందించే రెవెన్యూ సేవలతోపాటు విలువైన ప్రభుత్వ భూములను, చెరువులు, కాలువలు, కుంటలను, ఎండోమెంట్, ఫారెస్ట్, అసైన్డ్, అబాది, పోరంబోకు, శిఖం భూములను సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వం నూతనంగా నియామకం చేయనున్న గ్రామ ప్రజా అధికారులకు అప్పగించనుంది.

రెవెన్యూ రికార్డుల సవరణకు అవసరమైన క్షేత్రస్థాయి పంచనామ నిర్వహణ బాధ్యతలను కూడా గ్రామ ప్రజా అధికారులకు అప్పగించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడం పాటు అర్హుల ఎంపిక, ప్రభుత్వ ఆస్తులు, భూముల, చెరువుల సంరక్షణ బాధ్యతలను కూడా వీపీఓలకు అప్పగించనున్నారు.

అలాగే ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులలో విద్యార్హతలున్న సభ్యులలో ఒకరిని ఎంపిక చేసి ప్రతి గ్రామంలో ఒక మీసేవ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది. మీసేవల ద్వారా ప్రజలకు అందుతున్న పౌర సేవలను కూడా గ్రామ ప్రజా అధికారుల ద్వారా ప్రజలకు  గ్రామస్థాయిలోనే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే బీసీ కులగణన కార్యక్రమం నిర్వహణలో విలేజ్ రెవెన్యూ కార్యదర్శులు అత్యంత కీలకంగా ఉండనున్నారు.