- పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
- అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్వోఆర్ చట్టం
- పదేళ్ల బాధల నుంచి ప్రజలకు విముక్తి
- తుగ్లక్ పాలన చేసింది కేసీఆరే
- హరీశ్‌రావు.. మాకు చార్జ్‌షీట్ కాదు ప్రజలు మీకే డిశ్చార్జ్షీట్ ఇచ్చేశారు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రామాల్లో రెవెన్యూ సేవల కోసం వీఆర్ఏ, వీఆర్వో, సర్వేయర్ల వ్యవస్థను సంక్రాంతిలోపు పునరుద్ధరిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు.
గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, సామాన్యులకు రెవె న్యూ సేవలను దూరం చేసిందని విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
సోమ వారం నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదింపజేసి, ధరణిని ప్రక్షాళన చేయబోతున్నామని స్పష్టంచేశారు. ఉద్యోగులు, మేధావులు, రైతులు, ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి, ఆర్వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
ధరణిలోని 11 నుంచి 13 మ్యాడ్యుల్స్ను మార్పులు చేయనున్నట్టు తెలిపారు. ఈ చట్టాన్ని సోమవారం నుంచి జరిగే అసెం బ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని వివరించారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.
ధరణి పోర్టల్ ప్రక్షాళన
ఏడాది పాలనలో రెవెన్యూ శాఖకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకొని రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఒక వైపు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపడుతూనే మరోవైపు ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు స్పష్టంచేశారు.
ఇంకోవైపు కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనకు శ్రీకారం చుట్టి కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన టెర్రాసిస్ అనే విదేశీ సంస్ద నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను తప్పించి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వదేశీ సంస్ధ ఎన్ఐసీకి అప్పగించినట్టు తెలిపారు. ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయిలో ఎన్ఐసీ బాధ్యతలు తీసుకోనున్నట్టు వివరించారు.
తీరనున్న ప్రజల కష్టాలు
ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు, వ్యవసాయదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. తరతరాలుగా తమ యజమాన్యంలో ఉన్న భూములపై హక్కులు కోల్పోయామని, భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది మంది రైతులు మనోవేదనకు గురయ్యారని చెప్పారు.
రైతులు తమ భూములను అమ్ముకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావన్నారు. కేంద్ర, ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.46 లక్షల దరఖాస్తుల్లో పెండింగ్ లో ఉండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు.
కొత్తగా 3.16 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇప్పటివరకు వచ్చిన మొత్తం 5.62 లక్షల దరఖాస్తులలో 4.68 లక్షల దరఖాస్తులను పరిష్కరించారని తెలిపారు. గత ప్రభుత్వంలో సంవత్సరాలు గడిచినా దరఖాస్తులకు మోక్షం లభించేది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల వ్యవధిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.
వీఆర్వో, సర్వేయర్ల వ్యవస్థను తీసుకొస్తాం
గత ప్రభుత్వం కొంత మంది ఉద్యోగులపై అక్కసుతో మొత్తం వీఆర్వో, వీఆర్ఎ వ్యవస్థను రద్దుచేసి సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని మంత్రి మండిపడ్డారు. ఆ వ్యవస్థను పునరుద్ధరించాలని తమకు ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయని తెలిపా రు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులు కాకుండా రెవెన్యూపై అవగాహన ఉన్న ఉద్యోగులకు ఒక పరీ క్ష పెట్టి మళ్లీ తీసుకుంటామని చెప్పారు.
గ్రామీ ణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడానికి రెవెన్యూ సేవల పునరుద్ధరణకు సంక్రాం తిలోపు చర్యలు చేపడ్తున్నట్టు చెప్పారు. రాష్ర్టం లో 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్య వహారాలను పర్యవేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించినట్టు తెలిపారు.
త్వరలోనే సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని, ఇందుకు వెయ్యి సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రీకృతమై ఉన్న అధికారాలను వికేంద్రీకరించి, మండల స్థాయిలో ఎంఆర్వోకు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు అధికారాలను అప్పగించినట్టు తెలిపారు.
కేంద్రంత నుంచి వాటా తీసుకుంటాం
ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లకు తగ్గకుండా ఇస్తామని మంత్రి తెలిపారు. సొంతింటి నిర్మాణానికి స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.౫ లక్షలిస్తామన్నారు. 400 చ.గ.కంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకునేందుకు అనుమతినిస్తామని తెలిపారు. లబ్ధిదారులను ఇందిరమ్మ యాప్ ద్వారా ఎంపికచేసి, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహిస్త్తామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అర్హులైన పేదవాళ్లకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులను తీసుకోలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం కేంద్రం నుంచి వాటా తీసుకుంటుందని వెల్లడించారు. ఒకవేళ కేంద్రం నిధులివ్వకున్నా తామే భరిస్తామని స్పష్టంచేశారు.
2004 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లకు మాత్రమే గత ప్రభుత్వం టెండర్లు పిలిచి, వాటిలో 62 వేల వరకు మాత్రమే నిర్మించిందన్నారు. వీటిని కూడా తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టిందన్నారు.
అసంపూర్తిగా ఉన్న మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ప్రజాపాలన ఉత్సవాలు ముగిసిన తర్వాత జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బీఆర్ఎస్కు డిశ్చార్జ్ షీట్ ఇచ్చారు
బీఆర్ఎస్ తమపై చార్జ్ షీట్ విడుదల చేయడం కాదని, ప్రజలు వారికే డిశ్చార్జ్ షీట్ ఇచ్చారని మంత్రి ఎద్దేవాచేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పాలనపైన ఛార్జ్ షీట్‌ను ప్రవేశపెట్టడంపై మంత్రి స్పందించారు. హరీశ్‌రావుకి ఇంకా జ్ఞానోదయం కాకపోవడం విచారకరమని అన్నారు. పదేండ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేసినవారే.. ఇవాళ చార్జ్‌షీట్ అంటున్నారని మండిపడ్డారు.
గత పదేళ్ల కేసీఆర్ పాలన.. తుగ్లక్ పాలనేనని స్పష్టంచేశారు. ఇప్పుడేదో గురుకుల బాట అంటూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయించడం, డబ్బు మూటలు పట్టుకొచ్చిన వారిని తప్ప ఎవరినీ కలవకపోవడం, ప్రజలు నోరు తెరవకుండా ధర్నా చౌక్‌ను ఎత్తేయడం, ఎమ్మెల్యేలను మంత్రులను కలవకపోవడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని చెప్పారు.
ఎర్రవెల్లిని రాజధానిగా చేసుకుని, ఫాంహౌస్‌ను సెక్రటేరియట్ చేసుకుని రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్టు పాలించిన వారిది తుగ్లక్ పాలనా.. కాదా? అని ఘాటుగా స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రావాల కోరుకుంటున్నట్టు పొంగులేటి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.