13-02-2025 07:43:53 PM
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి మణుగూరు ఏరియా కొండాపురం సిహెచ్ పి లో గురువారం అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వృక్ష కల్యాణ మహోత్సవం, సహపంక్తి భోజనాలు కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు ఏరియా కొండాపురం సిఎస్ పి ఆవరణలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ ఓంకారేశ్వరి దేవి ఆలయంలో సింగరేణి సంస్థ, ఉద్యోగుల, కార్మికుల సంరక్షణ, లోక కళ్యాణం లక్ష్యంగా లక్ష్మీ నారాయణ స్వామి వృక్ష కళ్యాణ మహోత్సవం (రావి చెట్టు నారాయణస్వామి, వేప చెట్టు లక్ష్మీదేవిలుగా) గురువారం నాడు కన్నుల పండువగా జరిగింది, కుల మతాలకతీతంగా సింగరేణి పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కలిసి సోదర భావంతో, భక్తిశ్రద్ధలతో వృక్ష కళ్యాణం మహోత్సవం జరుపుకున్నారు.
నారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులకు ఆభరణాలు, కళ్యాణ వస్త్రాలు, పూలమాలలు, పూజా ద్రవ్యాలు DGM ఆఫీసు నుండి ఆలయం వరకు మేళ తాళాలతో అధికారులు, కార్మికులు ఆనందోత్సాహాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఎప్పుడు యంత్రాల ధ్వనులతో ప్రతిధ్వనించే కేసిహెచ్ పి ఆవరణలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం శ్రీశ్రీశ్రీ ఓంకారేశ్వరీ దేవి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష్మీనారాయణ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. పలువురు దంపతులు కళ్యాణ తంతు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరియా జిఎం దుర్గం రామచందర్, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ లు పాల్గొని స్వామివారి వృక్ష కల్యాణ మహోత్సవాన్ని ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఉద్యోగులతో కలిసి ఆసక్తిగా తిలకించారు.
అధికారులు, ఇంజనీర్లు, సూపర్వైజర్లు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమంలో సమిష్టిగా అందరూ పాల్గొన్నారు. కార్యక్రమంలో కేసిహెచ్ పి డిజిఎం, ఆలయ ధర్మకర్త వి మదన్ నాయక్, ఇంజనీర్లు ఆర్ఎస్ గౌడ సందీప్, రామకృష్ణ, మల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు ఆవుల నాగరాజు, జీ శ్రీనివాస్, వత్సవాయి కృష్ణంరాజు, శ్యాం వర్మ, నాగెల్లి వెంకట్, శ్రీకాంత్, ఎస్ డి నా సర్ పాషా, హెచ్ఎంఎస్, బిఎంఎస్ లతో పాటు ఇతర కార్మిక సంఘాల నాయకులు, సూపర్వైజర్లు అజిత్, కృష్ణమూర్తి, బి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ వి ప్రభాకర్ రావు, రామారావు, ముత్యం, శ్రీనివాస్, బాలాజీ, తదితరులు పాల్గొనగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సెక్రటరీ ఉడుత శివ, చారి నరసింహారావు, చలపతిల ఆధ్వర్యంలో కార్మికుల సహకారంతో విస్తృత ఏర్పాట్లు చేశారు.