ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడుతలో 288 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మహాయుతి పేరుతో ఎన్డీఏ, మహావికాస్ అఘాడీ పేరుతో ఇండీ కూటమి పోటీ పడుతున్నాయి. ఈ నెల 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలో పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముంబయి రాజ్ భవన్ లో గవర్నర్ సీసీ రాధాకృష్ణన్ ఓటు వేశారు. బారామతిలో ఎన్ సీపీ-ఎస్ సీపీ చీఫ్ శరత్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్ సీపీ-ఎస్ సీపీ నాయకురాలు సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్ పుర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముంబయిలో సచిన్, కుటుంబసభ్యులు, నటులు జాన్ అబ్రహాం, సోనూసూద్, ఫర్హాన్ అక్తర్, దర్శకురాలు జోయా అక్తర్ ఓటు వేశారు. అటు లాతూరులో రితేశ్ దేశ్ ముఖ్, నెనీలియా దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు కార్తీక్ ఆర్యన్ 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో ఉదయం 9 గంటల సమయానికి ఓటింగ్ శాతం 6.61 శాతానికి చేరుకుంది. గడ్చిరోలిలో 12.33శాతం, గడ్చిరోలిలోని ఆర్మోరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 13.53 శాతం పోలింగ్ నమోదైంది. ముంబై సబర్బన్ ప్రాంతాలలో, 7.88 శాతం ఓటర్లు పాల్గొన్నారు, భాండప్, ములుండ్ సబర్బ్‌లలో వరుసగా 10.59 శాతం, 10.71 శాతం, ముంబై నగరంలో 6.25 శాతం, కోలాబాలో 5.35శాతం, వర్లీలో 3.78శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.