calender_icon.png 20 January, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో బీసీ కోటాపై ఊగిసలాట

04-10-2024 12:00:00 AM

డా. తిరునహరి శేషు :

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవలసి ఉంది. అలా కానప్పుడు ప్రత్యామ్నాయంగా పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీలకు నిర్దిష్ట కోటాలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అనే మాటకు కట్టుబడి ఉండాలి. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కానప్పుడు పార్టీ పరమైన రిజర్వేషన్లు అయినా ఇవ్వాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉన్నది. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామనే ప్రధాన హామీని ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలనా కాలపరిమితి ఫిబ్రవరి నెలలోనే ముగిసి పోయిన నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతున్న వేళ కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ బీసీ వర్గాల నుండి తెరపైకి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వగలుగుతుందా? ఇవ్వటానికి ఉన్న అడ్డంకులు ఏమిటి అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. 

 73, 74 రాజ్యాంగ సవరణలు చేసిన తర్వాత ఆర్టికల్ 243 (డి) ప్రకారం పంచాయతీలలో ఆర్టికల్ 243 (టీ) ప్రకారంగా, పురపాలక సంస్థలలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారంగా, మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ,బీసీలకు మాత్రం ఒక నిర్దిష్ట కోటాను నిర్ణయించకుండా రిజర్వేషన్ల కోటాను రాష్ట్రాలకు వదిలివేయటం జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో 1994 నుండి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు కానీ 2010లో కే. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కోటా, రిజర్వేషన్ల అమలు ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే జరగాలని ఆదేశించింది.

ఈ తీర్పు తర్వాత 2013లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ట్రిపుల్ టెస్ట్ ద్వారా నిర్వహించే ప్రయత్నంలో బీసీ రిజర్వేషన్లు తగ్గే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు బీసీ సంఘాలు, ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ ఒక్కసారికి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

కానీ 2019లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారంగా 16 శాతం నుండి 27 శాతానికి పెంచడం వలన రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాట రాదనే నిబంధన మేరకు బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోయాయి.

అంటే బీసీలు స్థానిక సంస్థలలో 11 శాతం రిజర్వేషన్లను కోల్పోయారు. 2021నాటి వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులోనూ, 2022 నాటి సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్  కేసులోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ కోటాను నిర్ణయించాలని చెప్పటంతో బీసీల రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయి. స్థానిక సంస్థలలో బీసీలకు నిర్దిష్ట కోటాను నిర్ణయించకపోవడం, వెనుకబాటుతనం ప్రాతిపదికగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వటం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

చట్ట ప్రకారం సాధ్యమా? 

డెడికేటెడ్ బీసీ కమీషన్ ఏర్పాటు చేసి బీసీల వెనుకబాటుతనంపై లెక్కలు తీసిన తరువాత, ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ, వర్టికల్ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల కోటా నిర్ణయించాలి కాబట్టి 2019లో స్థానిక సంస్థల ఎన్నికలలో  బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోయాయి.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతుంది అనే ప్రశ్న ఉదయిస్తున్నది.  బీసీలకు 42 శాతం ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి పెరుగుతాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు  50 శాతం పరిమితి మించరాదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో బీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలుగుతారు?కులగణన తర్వాత బీహార్‌లో రిజర్వేషన్లు 46 శాతం నుండి 65 శాతానికి పెంచితే పాట్నా హైకోర్టు రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది.

పాట్నా హైకోర్టు తీర్పుపై బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు కూడా పాట్నా హైకోర్టు తీర్పును సమర్థించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కులగణన చేసినా 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో బీసీలకు ఎలా ఇవ్వగలుగుతారు? ప్రత్యేక చట్టం చేసినా ఆ చట్టం ఆమోదానికి ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. అప్పటివరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపరా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

పార్టీ రిజర్వేషన్లునా ఇవ్వండి 

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు ప్రత్యామ్నాయంగా పార్టీపరమైన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ,బీజేపీలు  బీసీలకు42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అనే మాటకు కట్టుబడి ఉంటే చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కానప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉన్నది.

12,769 గ్రామపంచాయతీలలో 42 శాతం అంటే 5,362 గ్రామపంచాయతీలలో మూడు పార్టీలు బీసీలను గ్రామపంచాయతీ ప్రెసిడెంట్లుగా నిలబెట్టాలి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న 23 శాతం రిజర్వేషన్లు కొనసాగితే 2,936 గ్రామ పంచాయతీలే బీసీలకు రిజర్వ్ చేయబడతాయి. అంటే 2,426 గ్రామ పంచాయతీలు బీసీలకు దక్కకుండా పోతాయి.

2019లో స్థానిక సంస్థల ఎన్నికలలో  బీసీల రిజర్వేషన్ 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోవడం వలన  బీసీలు 1405 గ్రామ పంచాయతీలను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనే హామీ ఇచ్చింది. మిగతా రెండు పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీలు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి

కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మూడు పార్టీలు 16,086 మంది బీసీలను గ్రామపంచాయతీ ప్రెసిడెంట్లుగా నిలబెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అప్పుడే మూడు రాజకీయ పార్టీలకు బీసీల నాయకత్వం, వారి అధికారం పట్ల నిబద్ధతతో ఉన్నారని  బీసీలకు నమ్మకం కలుగుతుంది. 

స్థానిక సంస్థలలో బీసీలకు ఒక నిర్దిష్టమైన రిజర్వేషన్ల కోటా నిర్ణయించకపోవటం, తరువాత వివిధ కేసులలో వచ్చిన తీర్పులు  బీసీల రిజర్వేషన్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో స్థానిక సంస్థలలో  బీసీల రిజర్వేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి కాబట్టి రెండు ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్లను కాపాడటానికి,  వారి రిజర్వేషన్లను పెంచటానికి అన్ని మార్గాలను వెతకవలసిన అవసరమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిస్థాయిలో హామీ ఇచ్చిన మేరకు అమలు చేసి బీసీల పట్ల వారి అభివృద్ధి, సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆశిద్దాం. 

వ్యాసకర్త సెల్: 9885465877