నగర ఓటర్లను విధిగా పోలింగ్ కేంద్రాలవైపు నడిపించేలా పలు సామాజిక సేవా కేంద్రాలు, వ్యాపార సంస్థలు
విలక్షణ ప్రోత్సాహకాలను ప్రజలకు ప్రకటిస్తుండటం
ఆనందదాయకం. ‘నిజానికి ఇలాంటివి ఆరోగ్యకరం
కాకున్నా పోలింగ్ శాతం పెంచుకోవడం కోసం
తప్పనిసరి’ అని సామాజిక వేత్తలు అంటున్నారు.
కర్నాటకలోని 14 లోక్‌సభ నియోజక వర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. వాటిలో బెంగళూరులోని నాలుగు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కాగా, ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు విరివిగా పాలు పంచుకునేలా చేయడం కోసం పలు వ్యాపారసంస్థలు రక రకాల రాయితీలు ప్రకటిస్తున్నాయి. బెంగళూరులో కోటిమందికిపైగా ఓటర్లున్నారు. నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటం సర్వసాధారణం. పలు కారణాలతో ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. నగర ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా ప్రోత్సహించడానికి రెస్టారెంట్లు, పబ్‌లు, టాక్సీ సంస్థలు డిస్కౌంట్లు, ఉచిత తాయిలాలు, ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేస్తున్నాయి.
దేశాబివృద్ధికి మేము సైతం
బెంగళూర్‌కు చెందిన నృపతుంగ రోడ్‌లోని నిసర్గ గ్రాండ్ హోటల్ పోలింగ్ రోజున ఓటర్లకు ఉచితంగా బటర్ దోశ, ఘీ రైస్, కూల్‌డ్రింక్‌లు ఆఫర్ చేస్తోంది. బెల్లందూర్‌లోని ‘డెక్ ఆఫ్ బ్రూస్’ అనే రెస్టారెంట్ కమ్ పబ్ ఈనెల 27, 28 తేదీల్లో తమ పబ్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఓ మగ్ బీర్‌తోపాటు మిగతా డ్రింక్స్‌పై డిస్కౌంట్లు ఇస్తోంది. ‘ఓటింగ్ ప్రక్రియలో పాలు పంచుకుని దేశాభివృద్ధికి తమ వంతు సేవ చేస్తున్న ఓటర్లకు తాము చేస్తున్న సత్కారం ఇదని’ ఆ పబ్ యజమాని ప్రఫుల్ల రాయ అంటున్నారు.
వారం పాటు ఉచిత రాయితీ
నగరంలో పలు ప్రాంతాల్లో ‘సోషల్’ పేరుతో పబ్‌లు నిర్వహిస్తున్న మరో సంస్థ అయితే, వినూత్న రీతిలో ఓటింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఓటు వేయాల్సిందిగా కోరుతూ సందేశం ఉండే ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టింది. ఓటు వేశాక తమ పబ్‌కు వచ్చే అతిథులు ఈ బిల్లుతోపాటుగా ఓటు వేశారనడానికి గుర్తు గా వేలికి పెట్టిన సిరాను చూపిస్తే భోజనంపై 20 శాతం రాయితీని అందిస్తోంది. పోలింగ్ తేదీనుంచి వారం రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉం టుందని కూడా ఈ పబ్‌ల యజమాని, ఇంప్రెసారి యా ఎంటర్‌టైన్‌మెంట్, హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దివ్యా అగర్వాల్ చెప్తున్నారు.
ర్యాపిడో ఉచిత ప్రయాణం
కాగా, ప్రైవేట్ ట్యాక్సీ ఆపరేటర్ ర్యాపిడో ఓటు వేయడానికి వచ్చే దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు నగరాల్లో ప్రతి ఓటరు ఓటు వేయడం కోసం తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ర్యాపిడో సహవ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అంటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకునేందుకు సమాన అవకాశం ఉండేలా చూడటానికి తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్తున్నారు. పై కంపెనీలే వీళ్లే కాదు, నగరంలోని పలు ఇతర సంస్థలు కూడా ఓటు వేసేలా జనాన్ని పోలింగ్ కేంద్రాలకు నడిపించేలా రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. వీరి స్ఫూర్తితోనైనా నగరాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు వస్తారేమో చూద్దాం.