28-02-2025 12:36:40 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్‌ను ఎన్నికల అధికారులు ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటలకు ముగించారు. సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఓట్లు 15094 ఉండగా 9811 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
65 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఆందోల్ రెవిన్యూ డివిజన్ లో 2437 మందికి ఓటు హక్కు ఉండగా ఎన్నికల్లో 1604 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 65. 82 శాతం ఓటింగ్ నమోదు కావడం జరిగింది. నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ లో 3577 మందికి ఓటు హక్కు ఉండగా 2527 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 70.65 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది.
జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ లో 4544 మందికి ఓటు హక్కు ఉండగా 3108 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 68.40 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 25652 మందికి ఓటు హక్కు ఉండగా 17050 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 66.47 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి 85.69 శాతం పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85.69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ లో 1621 మందికి ఓటు హక్కు ఉండదా 1313 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 81 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఆందోల్ డివిజన్ లో 185 మందికి ఓటు హక్కు ఉండగా 169 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఆందోల్ రెవెన్యూ డివిజన్ లో 91.35 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది.
నారాయణఖేడ్ డివిజన్ లో 375 మందికి ఓటు హక్కు ఉండగా 347 మంది ఓట్లు వేశారు. నారాయణఖేడ్ డివిజన్‌లో 92.53 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. జహీరాబాద్ డివిజన్ లో 509 మందికి ఓటు హక్కు ఉండగా 476 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దీంతో డివిజన్ లో 93.52 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్లు 2690 మంది ఉండగా 2305 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా లో మొత్తం 85.69 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. పోలింగ్ బాక్స్ లను కరీంనగర్ ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిన్నశంకరంపేటలో ఓటు వేసిన ఎమ్మెల్యే రోహిత్‌రావు
చిన్నశంకరంపేట(మెదక్), ఫిబ్రవరి 27: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసిన మేధావులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోనున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జడ్పీహైస్కూల్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజేపి గ్లోబల్ ప్రచారంతో పాటు డబ్బులు పంచినప్పటికి మేధావులు ఎవరు కూడా లొంగలేరని ఆయన అన్నారు.
అభివృద్ధిని చూసి ప్రజా కురుక్షేత్రంలో ధర్మమే అభివృద్ధికి పట్టం కట్టనుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం హావేళిఘణపురం మండలం, పాపన్నపేట మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, హావేలిఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజిరెడ్డి, సాన సత్యనారాయణ, ఆవుల రాజిరెడ్డి, పరుశురాం, లక్కరు శ్రీనివాస్, నాగిరెడ్డి, శ్రీకాంత్, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, సూఫీ, తాజా మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, బొజ్జ పవన్, జీవన్ రావు, శ్రీనివాస్ చౌదరి, శంకర్, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, తాజా మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో పట్టభద్రుల స్థానానికి 75.26 శాతం టీచర్ల స్థానానికి 95.03 శాతం
మెదక్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఓటింగ్లో 95.03 పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రుల స్థానానికి 75.26 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు భారీగానే నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఓటర్లు 1,347 ఓట్లు ఉండగా, పట్టభద్రుల ఓట్లు 12,472 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఉపాధ్యాయ ఓటర్లు 95 శాతం వినియోగించుకున్నారు.
ఇలావుండగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, టీచర్స్ మొత్తం పోలింగ్ కేంద్రాలు 43 ఉన్నాయని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్ల పట్ల ప్రజల్లో మంచి స్పందన లభించిందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రాడ్యుయేట్ 43 శాతం పోలింగ్ నమోదు కాగా, టీచర్స్ 77 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పట్టబద్రులు ఓటర్స్ జిల్లాలో ఎక్కువ ఉన్నందువల్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన తాగునీరు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని ఎటువంటి పొరపాట్లుకు తావులేకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా కరీంనగర్ రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్స్ లను తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తాసిల్దార్ లక్ష్మణ్ బాబు సంబంధిత సిబ్బందిపాల్గొన్నారు.
కొండాపూర్‌లో...
కొండాపూర్ ఫిబ్రవరి 27 : కొండాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ తన ఓటు హక్కును కొండాపూర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.