- పురుష ఓటర్లు 1,66,16,446 మంది
- మహిళా ఓటర్లు 1,68,07,100 మంది
- 28 వరకు డ్రాప్ట్ జాబితాపై అభ్యంతరాలు
- జనవరి 6న తుది జాబితా ప్రకటన
- 2025 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారు
- ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణలో 3,34,౨౬,323 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురు ష ఓటర్లు 1,66,16,446 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,68,07,100 మంది ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు.
2,777 మంది థర్డ్ జెండర్ ఓటర్లు, 15,948 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో సీఈవో మీడియాతో మాట్లాడుతూ.. గత జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,30,52,491 మంది ఓటర్లు ఉన్నారని, ఈ స్పెషల్ సమ్మరీ రివ్యూలో దాదాపు 1.18 శాతం ఓటర్లు పెరిగినట్లు చెప్పారు.
కొత్తగా 8 లక్షలమంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఇందులో 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వారు 4,73,838 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వారు 2,25,462 మంది, వికలాం గులు 5,28,085 మంది, ఓవర్సీస్ ఓటర్లు 3,578 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 28 వరకు డ్రాప్ట్ జాబితాపై అభ్యంతరాలు తీసుకోనున్న ట్లు, జనవరి 6న తుది జాబితాను ప్రకటించనున్నట్లు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
పెరిగిన 551 పోలింగ్ కేంద్రాలు
తెలంగాణలో 551 కేంద్రాలు పెరిగాయని సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 35,907 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ఈ నెల 9,10 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని, బీఎల్‌ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు.
2025 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండినవారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సీఈవో సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు.
ఓటు హక్కు నమోదులో మహిళా ఓటర్లే ఎక్కువ..
కొత్తగా 8,02,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోగా, అందులో పురుషులు 3,80,364 మంది, మహిళా ఓటర్లు 4,22,324 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 117 మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకోగా, వారిలో మేడ్చల్ మల్కాజ్‌గిరి నుంచి 24 మంది, హైదరాబాద్‌లో 23, రంగారెడ్డి జిల్లాలో 11 మంది, సంగారెడ్డి జిల్లాలో 8 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు థర్డ్ జెండర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.