- రిజర్వ్‌బ్యాంక్ పాలసీ నిర్ణయాలు
- ఒకవైపు జీడీపీ వృద్ధి అంచనాలు కట్
- మరోవైపు ద్రవ్యోల్బణం అంచనాలు పెంపు
ముంబై, డిసెంబర్ 6: జీడీపీ వృద్ధి రెండేండ్ల కనిష్ఠస్థాయికి పడిపోయినా, ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్న నేపథ్యంలో మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌బ్యాంక్ పాలసీ నిర్ణయాలు వెలువడ్డాయి. వరుసగా 11వ సమీక్షలోనూ వడ్డీ రేట్లను తగ్గించలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని చొప్పించేందుకు క్యాష్ రిజర్వ్ రేషియోను (సీఆర్‌ఆర్) మాత్రం అరశాతం తగ్గించింది.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం అనంతరం శుక్రవారం గవర్నర్ శక్తికాంత్‌దాస్ నిర్ణయాలను వెల్లడించారు. కీలక రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్దే అట్టిపెడుతున్నట్లు తెలిపారు. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు బ్యాంక్‌లకు అదనపు నిధుల్ని అందుబాటులోకి తేవడానికి సీఆర్‌ఆర్‌ను 4.5 శాతం నుంచి 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) రెండు విడతలుగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్ గరిష్ఠసహన స్థాయి 6 శాతాన్ని మించి 6.21 శాతానికి పెరగ్గా, ఈ జూలైధి ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అనూహ్యంగా రెండేండ్ల కనిష్ఠస్థాయి 5.4 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 4 శాతం సమీపానికి దిగిరానందున రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. ఆర్బీఐ రెపో రేటును యథాథంగా ఉంచడం ఇది 11వ సారి. 2023 ఫిబ్రవరి నుంచి ఇదేస్థాయి వద్ద రెపో రేటు కొనసాగుతున్నది.
సీఆర్‌ఆర్ కోతతో బ్యాంక్‌లకు రూ.1.16 లక్షల కోట్ల అదనపు నిధులు
క్యాష్ రిజర్వ్ రేషియోను 25 బేసిస్ పాయింట్ల చొప్పున (పావు శాతం) చొప్పున రెండు విడతల్లో మొత్తం 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గించడంతో బ్యాంక్‌ల చెంతకు అదనంగా రూ.1.16 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఈ తగ్గింపు డిసెంబర్ 14న పావుశాతం, డిసెంబర్ 28న పావుశాతం చొప్పున అమలులోకి వస్తుందన్నారు.
బ్యాంక్‌లు సమీకరించే నిధుల్లో కొంత శాతాన్ని రిజర్వ్‌బ్యాంక్ వద్ద అట్టిపెట్టాల్సి ఉంటుంది. దానినే సీఆర్‌ఆర్‌గా వ్యవహరిస్తారు. ఆర్బీఐ వద్ద సీఆర్‌ఆర్‌గా ఉంచే నిధులపై బ్యాంక్‌లకు ఆర్బీఐ ఎటువంటి వడ్డీ చెల్లించదు. సీఆర్‌ఆర్‌ను పెంచితే బ్యాంక్‌లు రుణాలిచ్చే నిధులు తగ్గుతాయి. సీఆర్‌ఆర్ తగ్గిస్తే బ్యాంక్‌ల రుణ వితరణకు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి.
ఆర్బీఐ గవర్నర్‌గా మరో టెర్మ్‌పై ప్రశ్నను దాటవేసిన దాస్
రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా వరుసగా రెండో టెర్మ్‌ను పూర్తిచేస్తున్న శక్తికాంత్ దాస్ తదుపరి టెర్మ్‌పై మీడియా అడిగిన ప్రశ్నను దాటవేశారు. పాలసీ ప్రకటన సందర్భంగా పదవీ కాలం పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం అందిందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ’మీకు నేనేమీ హెడ్‌లైన్ ఇవ్వను.
ద్రవ్య విధాన ప్రకటనకే పరిమితంకావడం మంచిది’ అని దాస్ చెప్పారు. 2021లో దాస్ పదవీకాలం ముగియబోతున్న నెలరోజుల ముందుగానే పొడిగింపును ప్రభుత్వం ప్రకటించింది. ఆర్బీఐ తదుపరి గవర్నర్ నియమాకంపై ప్రధాని నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్‌షాలతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
శక్తికాంత్ దాస్ పదవీ కాలం డిసెంబర్ 10తో ముగుస్తుంది. రెండు టెర్మ్‌లు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించి, 90 ఏండ్ల చరిత్రలో దీర్ఘకాలం పదవిలో (ఆరేండ్లు) ఉన్న వ్యక్తిగా దాస్ ఇప్పటికే రికార్డు సృష్టించారు.
అర్థాంతరంగా రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ స్థానంలో 2018లో బాధ్యతలు చేపట్టిన దాస్ గత ఆరేండ్లలో కొవిడ్ 19, ఉక్రెయిన్, మధ్యప్రాచ్య సంక్షోభాలు తదితర సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలిపిఉంచినందుకు వరుసగా రెండు దఫాలు ఉత్తమ సెంట్రల్ బ్యాంకర్‌గా శక్తికాంత్ దాస్ ఆవార్డులు అందుకున్నారు.
రేట్ల స్టాటస్‌కోకు నలుగురు సభ్యుల ఓటు
ఆర్బీఐ ఎంపీసీలో ముగ్గురు ఆర్బీఐ అధికారులు, మరో ముగ్గురు కేంద్రం నియమించిన స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇందులో నలుగురు సభ్యులు రెపో రేటును యథాతథంగా నిలిపిఉంచేందుకు ఓటు చేశారు. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు నగేశ్‌కుమార్, రామ్‌సింగ్‌లు పావుశాతం రేట్ల తగ్గింపునకు మొగ్గుచూపారు.
ప్రస్తుతం ఎంపీసీలో ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ నగేశ్‌కుమార్, ఆర్థికవేత్త సౌగంధ భట్టాచార్య, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్‌లు స్వతంత్ర సభ్యులుకాగా, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్ర, గవర్నర్ శక్తికాంత్ దాస్‌లు కేంద్ర బ్యాంక్ సభ్యులు.
పాలసీ ప్రధానాంశాలు
*కీలక రెపో రేటులో మార్పులేదు. 6.5 శాతమే.
*పాలసీ వైఖరి ‘న్యూట్రల్’గా కొనసాగింపు
*క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్) 4.5 శాతం నుంచి 4 శాతానికి కోత.అరశాతం సీఆర్‌ఆర్ తగ్గింపుతో బ్యాంకింగ్ వ్యవస్థకు అందుబాటులోకి రూ.1.16 లక్షల కోట్ల నిధులు
*ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాల కుదింపు. గత సమీక్షలో ప్రకటించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు
*ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరపు ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంపు
*తనఖాలేని వ్యవసాయ రుణం పరిమితి రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు
*ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితి పెంపు.
*యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్‌ను ముందస్తు మంజూరీ చేయడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు అనుమతి
*ప్రజలకు విస్త్రతస్థాయిలో సమాచారం అందించడానికి పాడ్‌కాస్ట్ సర్వీసులు ప్రారంభించనున్న ఆర్బీఐ
* ఆర్బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 2025 ఫిబ్రవరి 5 తేదీల్లో!