హిందువులంతా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి
- అనాలోచితంగా ఓటేసి గోహత్య పాపులవ్వద్దు
- మోదీ గోపూజ చేస్తూనే గోవధను ప్రోత్సహిస్తున్నారు
- గో హంతకులపై హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలి
- తిరుమల దేవస్థానం గోశాల ఏర్పాటు చేసేవరకు కానుకలివ్వద్దు
- జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి
- హైదరాబాద్‌లో గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దిగ్విజయం
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): గోమాతను కాపాడేవారికే ఓటు వేస్తామని హిందువులంతా ప్రతిజ్ఞ చేసి, సంకల్పం తీసుకోవాలని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. గోమాతను రక్షిస్తామని శపథం చేసినవారికే ఓటేయాలని కోరారు.
గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న స్వామీజీ బుధవారం హైదరాబాద్‌లో గోధ్వజ్ స్థాపన చేశారు. అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గోపూజ సహా ఇతర కార్యక్రమాలకు హాజరై ప్రసంగించారు. ‘మేము కసాయిలం కాదు. అవసరమైతే వారి పాలిట కసాయిగా మారుతాం. వచ్చే ఎన్నికల్లో ఇది నిరూపిస్తాం’ అని స్వామీజీ హెచ్చరించారు.
గోమాతను రక్షించేవారికే ఓటు వేస్తామని శంకరాచార్య ఎదుట శపథం తీసుకున్నామని ఓట్ల కోసం వచ్చేవారికి చెప్పాలని సూచించారు. భారత రాజముద్రలో సత్యమేవజయతే ఉంటుందని, అందులో ప్రముఖ స్థానం కల్పించిన వృషభం గోమాత బిడ్డ అన్నారు. మన రాజచిహ్నాన్ని ముక్కలు ముక్కలుగా (గోమాంసం) కోసి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
గోవధను ప్రోత్సహిస్తున్న సర్కారు
మన ప్రధాని గోపూజ చేస్తూనే గోవధ చేసేవారికి సబ్సిడీలు ఇస్తున్నారని స్వామీజీ విమర్శించారు. వారికి అత్యాధునిక యంత్రాలను అందిస్తారని మండిపడ్డారు. పశు మాంసం అత్యధికంగా ఎగుమతి చేసేదేశంగా భారత్‌ను మార్చేశారని, గోవధ చేసేవారి నుంచి చందాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ప్రధాని కూడా గోసంరక్షణపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు.
మన ఓటుతో మన తల్లిని వధిస్తున్నారని, అందుకే హిందువులంతా ఐక్యంగా ఉండి దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. గోరక్షణ కోసం తాము చేస్తున్న యాత్రకు నాగాలాండ్ ప్రభు త్వం అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమకు ఆ రాష్ట్రంలో ప్రవేశించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. రవీంద్రభారతిలో జరిగిన సభకు హాజరైన వెయ్యి మంది హిందువులు గోసరంక్షణ చేసే వారికి మాత్రమే ఓటేస్తామని స్వామీజీ ఎదుట సంకల్పం తీసుకున్నారు. గోవధను అడ్డుకుని ఆవును రాష్ట్ర మాతగా ప్రకటించేవారికే పట్టం కడతామని ప్రతిజ్ఞ చేశారు.
గోసంరక్షణతోనే ఛత్రపతి అయ్యారు
గోరక్షణ చేశారు కాబట్టే శివాజీ మహరాజ్ ఛత్రపతిగా మారారని స్వామీజీ తెలిపా రు. 100 కోట్ల మంది సనాతన ధర్మం పాటించేవారున్న ఈ దేశంలో గోమాతను వధిస్తూ విదేశాలకు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మనమంతా కలిసి ఎన్నుకున్న ప్రభుత్వమే గోవధను వ్యాపారంగా మార్చేసిందని మండిపడ్డారు. మనదేశ జాతీయ జెండాకు ఎంతటి ప్రతిష్ఠ ఉంటుందో, మన తల్లిలాంటి గోవు మన ప్రతిష్ఠ అని అభివర్ణించారు.
తిరుమలకు కానుకలివ్వకండి
టీటీడీలో సొంతంగా గోశాల ఏర్పాటుచేసి, అక్కడి నెయ్యితో లడ్డూ తయారు చేసేవరకు హుండీలో కానుకలు వేయవద్దని భక్తులకు స్వామీజీ సూచి ంచారు. ‘శ్రీరామచంద్ర యాదవ్ అనే గో సంరక్షుడు టీటీడీ అంగీకరిస్తే లక్ష దేశీ గోవులతో గోశాల ఏర్పాటుకు ముందుకు వచ్చా రు. కానీ లక్షల కోట్ల భక్తుల కానుకలు దేవాలయంలో ఉన్నాయని, అందుకే తిరస్కరించారని చెప్పారు.
దిగ్విజయంగా గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర
హైదరాబాద్‌లో జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ చేపట్టిన గో ధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దిగ్విజయంగా సాగింది. బుధవారం విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం నివాసం వద్ద గో ధ్వజ్ స్థాపన అనంతరం భారీ ర్యాలీగా రవీంద్రభారతికి చేరుకొన్న స్వామీజీ, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట గో పూజ జరిగింది.
అనంతరం స్వామీజీకి మంగళహారతి, పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయక్రాంతి డైరెక్టర్లు విజయ, సౌమ్య భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గోమాత గొప్పదనంపై పాట పాడారు. ఎన్‌కే చతుర్వేది గ్రూప్ లలితాసహస్ర నామం ఆలపించారు.
స్వామీజీకి విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజం, విజయ దంపతులు గోమాత విగ్రహాన్ని బహూకరించారు. విజయక్రాంతి డైరెక్టర్లు శ్రీకాంత్, సౌమ్య దంపతులు కంచు గోమాత విగ్రహాన్ని ఆధ్యాత్మిక గురువు మణి మహారాజ్‌కు బహూకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎల్ రాజం కుటుంబం స్వామీజీకి పాదసేవ చేసి అశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ యాత్రకు సహకరిస్తున్న సీఎల్ రాజం కుటుంబానికి గోమాత ఆశీస్సులు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన మొట్టమెదటి కార్యక్రమం విజయవంతం అయ్యిందని సభికులంతా ముక్తకంఠంతో తెలిపారు.
కార్యక్రమంలో యుగతులసి ఫౌండేషన్‌కు చెందిన శివకుమార్, వీవీఎస్‌ఎన్ చౌదరి, బ్రాహ్మణ సంఘం తరఫున తులసి శ్రీనివాస్, బాల శ్రీనివాసన్, చతుర్వేది, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు సీ కవిత, ఏకం సంస్థాన్ భారత్ దళ్ నుంచి నరేంద్ర కుమార్ చతుర్వేది, వినయ్ శర్మ, సర్వదళ్ గోరక్షక్ మంచ్ నుంచి జైపాల్‌సింగ్ , దర్శనం ఎడిటర్ వెంకటరమణశర్మ, రాష్ట్ర ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, శ్రీచక్ర కన్‌స్ట్రక్షన్స్ ఉప్పల శ్రీధర్, బీఎస్‌ఎఫ్ ప్రమోద్ కోఠారి, మురళి గురుస్వామి, మంగు రాఘవరావు, సామాజిక సేవకుడు వక్కలంక శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్వామీజీది గొప్ప ప్రయత్నం
గో సంరక్షణ కోసం శంకరాచార్య స్వామీజీ ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. గోరక్ష కోసం మాకు అవకాశం లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. గో మాతను రాష్ట్ర మాతగా చేయాలనే సంకల్పంలో మనమంతా కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
జైపాల్ సింగ్ నేహాల్, సర్వదళ్ గో రక్షా మంచ్, హైదరాబాద్
రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు
గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలనే చిత్తశుద్ధి రాజకీయ నాయకుల్లో కొరవడిం ది. అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ ఇదే తీరులో ఉన్నాయి. శంకరాచార్య స్వామీజీ యాత్ర ద్వారా ప్రభుత్వాలపై తీవ్రమైన ఒ త్తి డి ఉంటుంది. భవిష్యత్తులో అధికారంలోకి రాబోయే ప్రభుత్వాలు సైతం ఈ అం శంపై సమీక్షించుకునే పరిస్థితి ఉంటుంది.
గోవింద్ హరి, గో సంరక్షక్
గోమాతను రక్షించలేకపోతే హిందువులం కాలేం
గోమాత అంటేనే కామధేనువు స్వరూపం. ఆర్థికపరమైన విషయాలు కాకుండా గోమాతను పూజించే విషయాలను ముందుకు తీసుకుపోవాలి. గోమాత హిందూ ధర్మానికి ప్రతీక. మనది హిందూ దేశం. ఈ దేశంలో గోమాతకు రక్షణ కల్పించకపోతే మనం హిందువులను కాలేము. దేశంలో ప్రతి రోజు లక్ష పశువులను వధిస్తున్నారు. శంకరాచార్య స్వామీజీ చేపట్టిన యాత్ర ఎంతో గొప్పది. అందరూ ఆయన వెంట నడవాలి.
నాగేశ్వర్ రావు,
సీబీఐ మాజీ డైరెక్టర్
గో సంరక్షణలో సీఎల్ రాజం కుటుంబం పల్లకీ మోస్తోంది
గోమాతను కాపాడేందుకు శంకరాచార్య స్వామీజీ చేస్తున్న యాత్ర ఎంతో గొప్పది. గోరక్షణ కోసం శంకరాచార్య దేశమంతా పర్యటిస్తుంటే, వారికి సీఎల్ రాజం గారి కుటుంబం పల్లకీ మోస్తున్నది. ఇదెంతో గొప్ప విషయం. మన శ్వాస ఆగిపోయేలోపు ప్రతి ఒక్కరూ గోపూజ చేయాలి. గోమాతకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం కోల్పోవద్దు.
గాయకుడు గజల్ శ్రీనివాస్
సనాతన ధర్మాన్ని ఏకం చేసేది గోమాతే
సనాతన ధర్మాన్ని ఏకం చేసేది గోమా త మాత్రమే. హిమాలయాల నుంచి శంకరాచార్య స్వామీజీ గో సంరక్షణ కోసం చేస్తున్న యాత్ర ఎంతో గొప్పది. సీఎల్ రాజం కుటుంబం ఈ యాత్ర కోసం చేసిన సహకారం మరిచిపోలేనిది. అంద రూ గోమాతను పూజిస్తే దేశంలో శాంతి, సుస్థిరత సాధ్యం.
గోపాల్ మణి మహారాజ్,
ఆధ్యాత్మిక గురువు
గోమాతను మొక్కినందుకే రేవంత్ సీఎం అయ్యారు
- తెలంగాణలో గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటిస్తారనే నమ్మకం ఉంది
- విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం
చరిత్రలో గో ధ్వజ కార్యక్రమానికి తొలిసారి హైదరాబాద్‌కు వచ్చి శంకరాచార్య స్వామీజీ ఈ నేలను పావనం చేశారని శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం అన్నారు. గోవు మానవునికి అన్ని రకాలుగా సాయపడుతోందని.. పాలు, మూత్రం, పేడ అన్నీ కూడా ఎంతో ఉపయుక్తకరమేనని తెలిపారు.
శంకరా చార్య దేశమంతా తిరిగి గోమాతను మొక్కినందుకే రేవంత్ సీఎం అయ్యారుఉద్యమం చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటిస్తారని తమకు విశ్వాసం ఉందని చెప్పారు. యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహించుకునేలా ప్రపంచం మారిందంటే భవిష్యత్తులో గోమాతను కూడా ప్రపంచం అంగీకరిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
యోగాను అన్ని మతాలు ఆహ్వానించినట్లుగానే భవిష్యత్తులో అన్ని మతాలు గోవును స్వాగతిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్ల షెడ్ల స్థానంలో గో మాతను ఇంటికి తీసుకువచ్చి పూజిస్తారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోమాతకు పూజ చేసిన తర్వాతే తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని.. ఫలితంగా ఆయన సీఎం అయ్యారని పేర్కొన్నారు.
గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల కోసం, మానవత్వాన్ని కాపాడేందుకు, దేశాన్ని విశ్వగురుగా చేసేందుకు, ఈ భూమిని కాపాడేందుకు, హిందూ సమజాన్ని ఐక్యం చేసేందుకు గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో ఎవరైతే గోమాతను రక్షిస్తారో వారే అధికారంలోకి వస్తారనే విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి వచ్చిన వెయ్యి మంది గో రక్షకులు వేలు, లక్షలు, కోట్లాదిగా మారతారనే విశ్వాసం తమకుందని అన్నారు.