calender_icon.png 30 November, 2024 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులానగర్ పిహెచ్ సి కి స్వచ్చంద సంస్థ వితరణ

30-11-2024 05:41:36 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు దాహార్తి తీర్చాలని సదుద్దేశంతో హైదరాబాద్ చెందిన స్వచ్ఛంద సంస్థ సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోరు వేసి మోటార్ బిగించి తాగునీటి సౌకర్యం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు స్ట్రీట్ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని, తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ, ఖాళీ సమయాలలో పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించిన డబ్బుతో గత 15 సంవత్సరాల నుండి మారుమూల ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాఠశాలల్లో నీటి వసతి ఏర్పాటు చేయడం మరుగుదొడ్లు నిర్మించడం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, ప్రజలలో మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించడం లాంటి  కార్యక్రమాలు చేస్తున్నారు. 

అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత నెల 30వ తేదీన సందర్శించినప్పుడు ఇక్కడ త్రాగునీటి సమస్యను గుర్తించిన ప్రతినిధులు పెద్ద మనసుతో ఇక్కడ కొత్తగా బోరు వేసి, దానికి మోటారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా తాగు నీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్, చల్లటి నీరు కొరకు ఫ్రిడ్జ్ ని వితరణగా అందజేశారు. వాటిని శనివారం స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ కు అందజేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. మంచినీటి కొరతను తీర్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ కాస్ ప్రెసిడెంట్ భవ్య శ్రీ, ఎక్స్ ప్రెసిడెంట్ బల్లెం దేదీప్య రాజేష్, నితీష్, మనోజ్, మోక్షిత్, కల్పన, హన్సిక, సేవా హృదయ్ ఆర్గనైజర్ బల్లెం చిట్టిబాబు, బల్లెం కరుణ శ్రీ, ఉండేటి బసవయ్య, ఉండేటి ఇర్మియ, బల్లెం అనిల్ కుమార్తో పాటు స్థానిక వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, ఆరోగ్య విస్తరణ అధికారి దేవ, పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, సూపర్వైజర్లు పోరాల శ్రీనివాస్, నాగబండి వెంకటేశ్వర్లు, కౌసల్య, రాజు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.