calender_icon.png 20 November, 2024 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల గొంతుక తెలంగాణ వెంకన్న

20-11-2024 12:00:00 AM

ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తొలుత ప్రారంభించింది తెలంగాణ ఉద్యోగులు. ఆ తర్వాత ఉద్యమానికి ప్రాణం పోసి నిలబెట్టింది విద్యార్థులు. దశాబ్దాలు గడిచినా, పాలకులు మారుతున్నా.. ఈ ఉద్యమం విజయ తీరాలకు చేరేదాకా నిత్యం ప్రజల హృదయాల్లో నిప్పుల కొలిమిలా మండేలా తెలంగాణ అస్తిత్వభావజాల వ్యాప్తికి శ్రీకారం చుట్టింది మేధావులు. విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు కీలకంగా పనిచేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. ప్రత్యేక రాష్ట్ర అవశ్యకతను అర్థమయ్యేలా, లక్ష్యసాధనలో భాగస్వామ్యం అయ్యేలా నిరంతరం భావవ్యాప్తి చేసి ప్రజలకు ఉద్యమ తొవ్వ చూపించింది మేధావులు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఉద్యమకారుల సంక్షేమం, సమస్యలనే ఎజెండాగా గళమెత్తి నినదిస్తున్న తెలంగాణ వెంకన్న గురించి ‘వీర తెలంగాణ’లో ప్రత్యేక కథనం.

మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి చాలామంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ పేరు చెప్పడానికి సంశయించారు. రాష్ట్ర పాలనా కేంద్రం అసెంబ్లీ, సచివాలయంతో పాటు అనేక ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీలలో ఆంధ్రా పెత్తనం కింద పనిచేయాల్సి రావడమే ప్రధాన కారణం. అనేక పత్రికా, టీవీ ఛానళ్ల కార్యాలయాల్లోనూ ఇదే వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లాంటి నగరాలలో ఈ తరహా వాతావరణం అధికంగా ఉంది.

అంతటి అననుకూల పరిస్థితుల్లోనూ రాజకీయ, సామాజిక, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలతో పాటు విద్యావంతులు, మేధావులను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ భావించింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భావం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదికకు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తొలి ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ వెంకన్న వ్యవహారించారు.

ఒక వైపు జర్నలిస్టుగా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో విద్యావంతులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, మేధావులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముందు వరుసలో నిలిచారు. 

జర్నలిస్టులతో ధూంధాం.. 

తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్శిటీతో పాటు మరికొన్ని ప్రాంతాలు ప్రధాన కేంద్రంగా ఉండి యావత్తు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ముఖ్యంగా.. తెలంగాణ ప్రజల మనోభావాల ఆర్తనాదాలను యావత్తు పాలకులకు కనువిప్పు కలిగించేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అమరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేసుకున్న ఎల్‌బీ నగర్ ప్రాంతాన్ని ప్రధాన ఉద్యమ కేంద్రంగా తీర్చిదిద్దాడు.

ఏ ఆంధ్రా నుంచి వేరు చేసి మమ్ములను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో.. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రధాన ముఖద్వారం ఎల్‌బీ నగర్ కేంద్రంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాడు. అలాంటి ప్రాంతంలో జర్నలిస్టుగా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడుగా, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడుగా పనిచేయడం కత్తిమీద సాము లాంటిదే.

తెలంగాణ ఉద్యమం అందించిన స్ఫూర్తితో వేలాది మంది ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా, ఆంధ్రా ప్రాంత ప్రజలను సైతం ఉద్యమానికి మద్దతు కూడగట్టడంలో కృషి చేశాడు. ముఖ్యంగా అన్ని పత్రికలు, ఛానళ్ల జర్నలిస్టులను కూడగట్టి జర్నలిస్టుల ధూంధాం నిర్వహించి ఉద్యమాన్ని భిన్నమైన కోణంలో నడిపించాడు. 

తెలంగాణ వెంకన్నగా ప్రసిద్ది

తెలంగాణ ఉద్యమంలో అత్యంత చురుకుగా పనిచేయడమే కాకుండా, స్వరాష్ట్ర సాధనలో కొనసాగిన వందలాది పోరాట రూపాలకు వెంకన్న నాయకత్వం వహించాడు. ఉద్యమాలను సృష్టించి పోరాటాలను నడిపించడంలో సుధీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్ కోదండరామ్, వరవరరావు, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీధర్ దేశ్‌పాండే, పిట్టల రవీందర్, గురజాల రవీందర్, టంకశాల అశోక్, సాంబశివుడు, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులకు ఉద్యమ సహచరుడుగా క్రీయాశీలకంగా పని చేశాడు.

ఒక వైపు హైదరాబాద్ జేఏసీ, మరో వైపు రంగారెడ్డి జిల్లా జేఏసీతో పాటు ప్రొ. కోదండరామ్ నాయకత్వంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగర్ హారం, మిలియన్ మార్చ్, సడక్ బంద్, సంసద్ యాత్ర, వంటా వార్పు, చలో అసెంబ్లీ తదితర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వెంకన్న పాత్ర మరువలేనిది. ఈ క్రమంలోనే పిండిగ వెంకన్న కాస్తా తెలంగాణ వెంకన్నగా ప్రసిద్ది చెందాడు. 

ఉద్యమకారుల గొంతుకగా..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం పరాయి పాలకులపై ఉద్యమించిన తెలంగాణ వెంకన్న ప్రస్తుతం ఉద్యమకారుల సంక్షేమం బాధ్యత ప్రభుత్వానిది, పాలకులదే అంటూ మరోసారి ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుతం తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న వెంకన్న రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాంటూ ఉద్యమ సహచరుడు రూబీ స్టీఫెన్‌తో కలిసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితిని ఏర్పాటు చేశారు.

ఈ సమితికి వ్యవస్థాపక ప్రధానకార్యదర్శిగా కొనసాగుతూ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఉద్యమకారుల పక్షాన గొంతుకగా మారాడు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల కోసం పోరాడుతున్నాడు. కష్టకాలంలో ఉన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. 

ఉద్యమకారులను గుర్తించాలి! 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న అనేక మంది ఉద్యమ కారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లను గుర్తించిన ప్రభుత్వాలు ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి జాగాలను ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. ఉద్యమకారుల సమస్యలను అధ్యయనం చేయడానికి టీజేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల మాదిరిగానే తెలంగాణ ఉద్యమ కారులను కూడా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి. 

 తెలంగాణ వెంకన్న 

-హైదరాబాద్ సిటీబ్యూరో, విజయక్రాంతి