14-03-2025 11:26:45 PM
చైనా, అమెరికా అధ్యక్షులకూ కృతజ్ఞతలు
ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి కృషి చేశారని మీడియా సమావేశంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి శ్రద్ధ చూపిన ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలపడానికి ముందు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో కలిసి పుతిన్ గురువారం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం గురించి మాట్లాడారు. ‘ఉక్రెయిన్ కాల్పుల విరమణకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయానికి వస్తే, నేను దాన్ని ఎలా చూస్తున్నానో మీకు చెబుతా. కానీ ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఇంత శ్రద్ధ చూపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు ఇలా చాలా మంది ప్రపంచ నేతలు ఈ వివాదానికి పరిష్కారం కోరుకున్నారు. అందుకోసం చాలా సమయాన్ని వెచ్చించారు. వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని వెల్లడించారు. కాగా గత నెలలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమైన సమయంలో ఉక్రెయిన్‌ేొరష్యా యుద్ధం అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంలో భారత్ తటస్థంగా ఉండదని, శాంతినే కోరుకుంటుదని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. యుద్ధానికి పరిష్కారం చూపడానికి ట్రంప్ చేసే ప్రయత్నాలకు మద్దతిస్తామని వెల్లడించారు.