calender_icon.png 18 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైజాగ్ టు చర్లపల్లి.. ఖాళీ రైల్!

18-01-2025 01:13:30 AM

  1. ప్రయాణికుల్లేకుండా నడిచిన ‘జన సాధారణ్’
  2. పండుగ సీజన్ అయినప్పటికీ స్పందన కరువు
  3. ద.మ.రైల్వే ప్రచార లోపమే కారణం

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): సంక్రాంతి సీజన్ వచ్చిదంటే చాలు రైల్వేస్టేషన్లలో ఫుల్ రద్దీ. రైళ్లన్నీ ఫుల్ ప్యాకెడ్‌గా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. పం డుగకు కనీసం 15 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి. పండు గ ముందు రోజు, తర్వాతి రోజుల్లోనైతే ప్రతి రైలు ప్రయాణికులతో కిటకిలాడుతుంది.

ఇక సాధారణ బోగీల్లోనైతే బాత్‌రూంల పక్కన, ఫుట్‌బోర్డుపై నించొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ.. అందుకు పూర్తి భిన్నంగా ఓ ప్రత్యేక రైలు శుక్రవారం ప్రయాణికుల్లేకుండానే ఖాళీగా గమ్యస్థానానికి చేరుకున్నది. ప్రత్యేక రైలు సర్వీసులపై ఎలాంటి ప్రచారం చేయకపోవడంతోనే ఈ దుస్థితి.

ద.మ.రైల్వే ఏపీలోని విశాఖపట్టణం రైల్వేస్టేషన్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు శుక్రవారం జన సాధారణ్ (అన్ రిజర్వ్‌డ్ రైలు నంబర్- 08533) ప్రత్యేక రైలు నడిపింది. ఈ సౌకర్యం ఉన్నట్లు ప్రయాణికుల కు తెలియదు. దీంతో రైలు సాయంత్రానికి ఖాళీగా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకున్నది.

ఇదే రోజు విశాఖ నుంచి హైదరాబాద్ వైపునకు వచ్చే అన్ని రెగ్యులర్ రైళ్లు కిటకిటలాడుతూ రావడం గమనార్హం. ద.మ. రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులపై విస్తృత ప్రచారం చేసి ఉంటే, ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో రెట్టింపు ఛార్జీలు చెల్లించి ప్రయాణించాల్సిన అగత్యం వచ్చేది కాదనే అభిప్రా యం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించి సోషల్‌మీడియా, రైల్వేస్టేషన్ల డిస్‌ప్లేలలో రైలు సర్వీసులకు సంబం ధించిన వివరాలను అప్‌డేట్ చేయాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతున్నది.

ఎనిమిది ప్రత్యేక రైళ్లు

ప్రత్యేక రైళ్ల రాకపోకలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ సందడిగా మారనున్నది. ద.మ. రైల్వే వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నది. కాజీపేట మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లు వయా సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ మీదుగా గమ్యస్థానాలు చేరుకుంటాయి.

గుంటూరు మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం నుంచి బయల్దేరి వయా విజయవాడ, గుంటూ రు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా గమ్యస్థానాలు చేరుకుంటాయి. ఈ రైళ్లన్నింటి లోనూ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని ద.మ.రైల్వే అధికారవర్గాలు తెలిపాయి.