- వైజాగ్ కేజీహెచ్ కొండపై సాగు
- పోలీసుల అదుపులో ఇద్దరు
విశాఖపట్నం, నవంబర్ 9: ఏపీలో గంజాయి సాగు కోసం స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతుండడంతో స్మగ్లర్లు పట్టణ ప్రాంతాలను, నగర శివారు ప్రదేశాలను కేంద్రంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ సిటీ సెంటర్‌లో ఉన్న కేజీహెచ్‌ను సాగు కోసం అడ్డాగా మార్చుకున్నారు. కేజీహెచ్ కొండపై ఉన్న బాలికల హాస్టల్ వెనకభాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో 20 నెలలుగా కొందరు స్మగ్లర్లు గంజాయిని పండిస్తున్నారు.
ఇండియన్ నేవీ పరిధిలో ఈ కొండ ప్రాంతాన్ని సాగుకు ఎన్నుకుని తమ దందాను నడుపుతున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కొండపై దాడి చేసి భారీ స్థాయిలో గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులను విశాఖ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా లేక వీరే ఒక ముఠాగా ఏర్పడి సాగు చేస్తున్నారా అని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.