సుల్తానాబాద్ లో జయంతి వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు...
పెద్దపల్లి (విజయక్రాంతి): వివేకానందుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Vijayaramana Rao) అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్వామి వివేకానందుని విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రపంచ దేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు అన్నారు. ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని, యువత వల్లే భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలక సతీష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం. రవీందర్, నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.