calender_icon.png 28 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణధార విషతుల్యం!

06-11-2024 02:00:26 AM

దక్కన్ పీఠభూమికి గతంలో నేను ప్రాణధారను..

నాకు మరో పేరు ‘మూచుకుందా’. ఒకప్పుడు నేను ప్రకృతి రమణీయతకు ఆలవాలాన్ని. నేను పంట లకు జీవధారను. మానవాళితో పాటు పశు పక్ష్యా దుల దాహార్తి  తీర్చే ప్రాణ ధారను. జలచరాలను నా ఎదపై పెంచిన తల్లిని. నేను అనంతగిరి కొండల్లో పుట్టాను. దక్కన్ పీఠభూమిలో నా పరవళ్లు. చిన్న పాయ గా మొదలై కొండల గుండా.. అడవుల గుండా నా పయనం. చిన్నమూసీ, ఆలేరు నదులను కలుపుకొని వడి వడిగా పరిగెడుతూ కృష్ణమ్మ ఒడికి చేరుకుంటాను. 

..అయితే ఇదంతా పాత వైభవం! ప్రస్తుతం నా కథే వేరు..! తలుచుకుంటే గుండె చెరువు. మనసు బరువు. ఇప్పుడు నేనో మురికి కూపాన్ని.. ప్రమాదకరమైన రసాయనాలు నింపుకొన్న ప్రవాహాన్ని.. దుర్గంధాన్ని వెదజల్లే జలాన్ని.. ఇప్పుడు నేను కాలకూట విషాన్ని.. జలచరాలను పొట్టనపెట్టుకున్న యమపాశాన్ని.. దాహం తీర్చు కుందామని వచ్చే జీవాల ఆరోగ్యాన్ని పీల్చే పిశాచిని..

పుట్టిన ఆడబిడ్డలకు గంగ, గోదావరి, యమున, నర్మద, కావేరి, కృష్ణమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.. ఆ పేర్లతో ముద్దుగా పిలుచు కుంటారు.. ఒక్కరు కూడా బిడ్డకు నా పేరు పెట్టరు.

మానవాళికి ఇప్పుడు నేను గుర్తుకు వస్తేనే కంపరం.. తప్పు పాలకులదా? ప్రజానీకానిదా? యం త్రాంగా నిదా? అనే ప్రశ్నలు పక్కన పెడితే ఇప్పుడు నా పరీవాహకం వేలాది ఆక్రమణలు, కబ్జాల పుట్ట! నా చుట్టూ రాజకీ యాలు ! ఇన్ని పరిణామాల మధ్య సర్కా ర్ చేపట్టిన ‘మూసీ ప్రక్షాళన’, ‘మూసీకి పునరుజ్జీవం’, ‘మూసీ సుందరీకరణ’ ప్రతిపాదనలు నాకు ఇంపుగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నా వైభవాన్ని, నేను విషతుల్యమైన క్రమాన్ని, ఆక్రమణల పరమైన పరిస్థితులను ఎత్తి చెప్పే క్రతువుకు ‘విజయక్రాంతి’ పూనుకున్నది. ఇక వాటి పూర్తి పాఠం ప్రతిరోజూ వరుసగా చదవండి!

  1. అనంతగిరి కొండల్లో పుట్టి.. జీవధారలా ప్రవహించి..
  2. పంట పొలాలకు జీవం పోసి.. పశుపక్ష్యాదుల దాహం తీర్చి..
  3. పట్టణీకరణ, పారిశ్రామీకరణతో నేడు మురికి కూపంగా ‘మూసీ’
  4. వేలాది ఎకరాల నుంచి వందల ఎకరాలకు పడిపోయిన ఆయకట్టు
  5. రాష్ట్రప్రభుత్వ ప్రక్షాళన ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

భారత్‌లో జీవనదిగా పేరున్న గంగా నదికి తిరుగే లేదు. భారతీయులు గంగా నదిని నదిలా చూడకుండా మాతగా భావిస్తారు. బ్రహ్మపుత్ర, నర్మద నదులు కూడా ఉత్తర భారతంలో ఎంతో ఫేమస్. దక్షిణభారతంలో గోదావరి, కృష్ణా, కావేరి నదుల గురించైతే చెప్పనక్కర్లేదు. కానీ, మూసీ అనే పేరు చెప్తే మాత్రం మనసు చివుక్కుమంటుంది.

ఒకప్పుడు జీవనదిలా పారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీటి వనరైన నది కాలక్రమేణా మురికి కూపంగా మారింది.  కలుషిత జలాలు కలిసి విషతుల్యమైంది. చెత్తాచెదారానికి నెలవైంది. ఆయకట్టు కుంచించుకుపోయింది. మనుషులైనా, జీవాలైనా నది నీరు తాగితే అనారోగ్యం పాలయ్యే పరిస్థితి నెలకొన్నది. కనీసం దానిని ఒక నదిగా గుర్తించని పరిస్థితులు నెలకొన్నాయి. 

రంగారెడ్డి/వికారాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్ :

కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ నది ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు. పంటల సాగుకు ఆధారం. మూసీహైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టింది.

అక్కడ చిన్న పాయగా ప్రయాణం మొదలై బుగ్గ రామేశ్వరం మీదుగా వికారాబాద్ శివారులోని ఆలంపల్లి, కొత్తగడి గుండా దిగువకు ప్రవహిస్తుంది. మూసీ 267 కిలోమీటర్ల మేర ప్రవాహించి నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 

సాగుకు ఆధారం..

నది ఆధారంగా పరీవాహకంలో రైతాంగం గతంలో వేలాది ఎకరాల్లో పంటలు పండించేది. నదిపై ఆధారపడి వికారాబాద్ శివారు ప్రాంతాలైన కొత్తగడి, ఆలంపల్లి, నవాబుపేట్ మండల పరిధిలోని చిట్టిగిద్ద, గంగ్యాడ, చించల్‌పేట్, పూలపల్లి, చిట్టిగడ్డ, కేశవపల్లి, పుల్స్‌మామిడి వంటి గ్రామాల్లో రైతులు ఒకప్పుడు వేలాది  ఎకరాల ఆయకట్టును సాగు చేసేవారు.

34 కిలోమీటర్ల మేర పరీవాహకంలో ఇప్పుడు సాగు కేవలం 392 ఎకరాలకు పరిమితమైంది. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలను రైతులు హైదరాబాద్‌కు వెళ్లి విక్రయిస్తున్నారు. పరీవాహకంలో దశాబ్దాల క్రితం ఏటా రెండు పంటలకు సాగునీరు అందగా, ఇప్పుడు కేవలం వానకాలం పంటలకే నీరు అందుతున్నది. 

నదికి ముచుకుందా పేరేలా వచ్చిందంటే..

మూసీకి ముచుకుందా అనే పేరు రావడం వెనుక స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాతన కాలంలో ముచుకుందా అనే సూర్యవంశ రాజు తన శత్రు రాజ్య పాలకుడైన కాలయవనుడిని జయించేందుకు శ్రీకృష్ణుడికి సాయం చేశాడని, అనంతరం ముచుకుందా మోక్షం పొందాడని పెద్దలు చెప్తారు. ఆయన ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతోనే మూసీకి ‘ముచుకుందా’ అనే పేరు వచ్చిందంటారు. మరో కథనం ప్రకారం.. ఉపనదులైన మూసా, ఈసీలు కలవడంతోనే నదికి మూసీ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు.  

ప్రధాన తాగునీటి వనరు..

1908లో వరదల తర్వాత నదిపై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) జంట జలాశయాల నిర్మాణం జరిగింది. వీటి ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలకు తాగునీరు అందింది. పశుపక్ష్యాదులకు ఇది తాగునీటి వనరు. ఒకప్పుడు మూసీలో వందలాది రకాల జలచరాలు పెరిగేవి. నది పరీవాహకంలో పెరిగే గ్రాసమూ పాడి రైతులకు వరంగా ఉండేది. అలాంటి నదిలో ఇప్పుడు పరిశ్రమల వ్యర్థాలు, చెత్తాచెదారం, మురుగు చేరుతుండటంతో విషతుల్యమైంది. నదీ జలాలు తాగు, సాగునీటి అవసరాలకు పనికిరా కుండా పోయింది. మురికి అనే పదానికి మూసీ ఇప్పుడు నిర్వచనంగా మారింది. 

ఒకప్పుడు వరదలు..

ఇప్పుడంటే మూసీ అంటే మన దృష్టిలో నగరం గుండా పారే ఒక పిల్ల కాలువ. నదిలో ఎప్పుడూ మురుగే పారుతుండడంతో దీనిని డ్రైనేజీ కాలువగా భావించే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నది ఒకప్పుడు వానకాలంలో ఉప్పొంగి ప్రవాహించి, జనావాసాల్లోకి వరద వచ్చేదని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయేవారంటే నమ్మశక్యం కాదు. మూసీ పరిధిలో 1908లో వచ్చిన వరదలే అతిపెద్ద విషాదం. వరదల కారణంగా నాడు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.  80 వేల మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. ఆ తర్వాత 1930, 1954, 1970లో నది ఉప్పొంగింది. 

నదీ తరంలో పండుగలు..

బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ అని అందరికీ తెలిసిందే. ఏటా నదీ తీరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగేవని పెద్దలు చెప్తారు. స్వచ్ఛమైన నదీ జలాల్లో రంగు రంగుల పూలతో బతుకమ్మలు కదులుతూ వెళ్తుంటే చూడచక్కగా ఉండేదని నాటితరం వృద్ధులు చెప్తూ మురిసిపోతుంటారు. అలాగే మొహర్రం ఊరేగింపునకు ముందు ముస్లింలు ‘ఆలమ్’లను నదీ పరీవాహకంలో ఉంచేవారంటారు. 

రాష్ట్రప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణకు పూనుకుంటామని ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించింది. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించి అనుకున్న పని చేసితీరుతామని స్పష్టం చేసింది. ఆక్రమణల చెర నుంచి నదిని పరిరక్షిస్తామని పేర్కొన్నది. మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేస్తామని కంకణం కట్టుకున్నది. 2026 కల్లా స్వచ్ఛమైన జలాలు పారిస్తామని చెప్తున్నది. దీనిలో భాగంగానే మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది.

ఈ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ..

పట్టణీకరణ పెరగడం, పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూసీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేట చెరువు నుంచి మూసీ హైదరాబాద్ మహానగరంలోకి ప్రవేశిస్తుంది. కాటేదాన్, పటాన్ చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి, అజామాబాద్, మల్లాపూర్, నాచారం వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే రసాయనిక వ్యర్థాలతో మూసీ జలాలు ప్రమాదకరస్థాయిలో కలుషితమవుతున్నాయి.

నార్సింగి, మణికొండ, షేక్‌పేట, గోల్కొండ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో మురుగు ఎక్కువగా చేరుతున్నది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట, నార్సింగి, అత్తాపూర్, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తున్నది.

పర్యాటకంపై పట్టింపే లేదు..

ప్రభుత్వాలు తలుచుకుంటే ఇప్పటికీ అనంతగిరిలో నది పుట్టిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు. పాలకులు పట్టించుకోకపోయినా అనంతగిరి ప్రకృతి అందాల గురించి ఇంటర్నెట్‌లో చూసి ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. కొందరైతే పనిగట్టుకుని, వ్యయప్రయాసలకోర్చి మూసీ ఉద్భవించిన చోటును చూసేందుకు తరలివస్తున్నారు.

అధికారులు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ‘మూసీ పుట్టిన స్థలం’ అనే ఫ్లెక్సీ పెట్టి చేతులు దులుపుకొన్నారు. అక్కడికి వెళ్లేందుకు పర్యాటకుల నుంచి అటవీశాఖ కొంత రుసుము వసూలు చేస్తున్నప్పటికీ, పర్యాటకులు నది పుట్టిన స్థలాన్ని కుదురుగా కూర్చొని, లేదా నించొని చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

ఇప్పటిఇప్పుడు మనం అక్కడి వెళ్లి చూసినా ఆ ప్రదేశమంతా ఎండుటాకులతో నిండి ఉంటుంది. చుట్టూ ఎండు పుల్లలు, పెద్ద పెద్ద మొద్దులే మనకు దర్శనమిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసిన పర్యాటకులకు మూసీ పుట్టిన స్థలం ఇదేనా? అనే అనుమానం కలుగక మానదు. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఇప్పటికైనా పట్టించుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.

పట్టణీకరణ పెరిగిన కొద్దీ కాలుష్యం..

రెండు దశాబ్దాల క్రితం నగరంలో పట్టణీకరణ అంతంతమాత్రంగా ఉండేది. కానీ, తర్వాత కోకాపేట, నార్సింగి, మణికొండ తదితర ప్రాంతాల్లో అమాంతం పట్టణీకరణ పెరిగింది. మహానగరంలో ఆయా ప్రాంతాలు కలిసిపోవడంతో ఇక్కడ జనసాంద్రత పెరిగింది. ఎంత జనసాంద్రత పెరిగితే మూసీలోకి అంతకు అంత మురుగు వచ్చి చేరుతున్నది.

రియల్టర్లు ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వేయడం, నాలాలపై స్థలాలను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తుండటం, వాగులు, కాలువలకు చెక్‌డ్యాంలు నిర్మించడంతో నది ప్రవాహం పూర్తిగా తగ్గి పోయింది. దీంతో క్రమంగా నది చిన్న వాగులా కుంచించుకుపోయింది. కొందరు రాత్రిళ్లు జంతువుల వ్యర్థాలు, ఇళ్ల నుంచి వెలువడే చెత్తాచెదారాన్ని కూడా నదిలోనే పడేస్తున్నారు.

లంగర్ హౌస్, అత్తాపూర్ ప్రాంతాలను కలిపే బ్రిడ్జిపై జాలీ ఉండటంతో కొంతమేర చెత్తాచెదార సమస్య తగ్గింది. కానీ, ఆ తర్వాత పారే నదిలో మళ్లీ మురుగు, చెత్తాచెదారం పేరుకోవడం మామూలైంది. ఈ నియోజకవర్గంలో ఎక్కడా మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడం పెద్ద లోటు. తారామతి బారాదరి వద్ద మణికొండ నుంచి వచ్చే ఓ భారీ మురుగు నాలా ద్వారా మూసీలోకి భారీగా మురుగు వచ్చి చేరుతోంది.