calender_icon.png 22 September, 2024 | 9:00 PM

దర్శనాలు

20-09-2024 12:00:00 AM

విమర్శనాత్మక, పరిశోధనాత్మక దృష్టి భారతీయ తత్త్వశాస్త్రాన్ని సుసంపన్నం చేసింది. ఈ పరిశోధనాత్మక దృష్టినే ‘ఆన్వీక్షికి’ అంటారు. ఏ విషయం మీదనైనా సమగ్రమైన అవగాహన కావాలంటే సహేతుకమైన ఒక జ్ఞాన సిద్ధాంతం ఉండాలని క్రమేణా గ్రహించారు. ఆ జ్ఞాన సిద్ధాంతాన్ని అనుసరించి వారు దర్శించిందే దర్శనంగా చెబుతున్నారు. 

‘దర్శనం’ అంటే చూడటం అని నిఘంటువు చెప్పినా భారతీయ తత్త్వశాస్త్రంలో సాంకేతికంగా దాని అర్థం ఒక జ్ఞాన సిద్ధాంతాన్ని అనుసరించి దర్శించిన సత్యం అనుకోవచ్చు. దర్శన శబ్దాన్ని మరొక విధంగా కూడ పండితులు నిర్వచించారు. జనన మరణాలతో కూడిన సంసారం మోక్షానికి ప్రబలమైన ప్రతిబంధకం. ఈ సంసారం నుంచి బయటపడి మోక్షాన్ని పొందే మార్గాలను కొందరు చూపించారు. వారిని దర్శనకర్తలు అన్నారు. వారు చూపించిన మార్గాన్ని ‘దర్శనం’ అన్నారు.

భారతీయ తత్త్వశాస్త్రంలో సాంకేతికంగా మన మేధావులు, ఋషి పుంగవులు అంతర్దృష్టితో దర్శించి మనకు అందించిన సిద్ధాంతాలే దర్శనాలు. ‘ఈ విశ్వం ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? ఈ విశ్వంలో నియతి (Order) ఎలా వచ్చింది? మానవుని గమ్యం ఏమిటి?’ ఇలా ఎన్నో ప్రశ్నలు వారిని ఆలోచింపజేసాయి. వాటిని కొందరు వారి స్వబుద్ధితో విచారించి వారి సిద్ధాంతాలను మనకు అందించారు. అలాంటి వారి సిద్ధాంతాలను ‘నాస్తిక దర్శనాలని’ అన్నారు. అవి, చార్వాక, జైన, బౌద్ధ దర్శనాలు.

వేద ప్రమాణం మీద అచంచల విశ్వాసంతో అంతర్దృష్టితో మనకు అందించిన దర్శనాలు ఆస్తిక దర్శనాలు. అవి గౌతముని న్యాయ దర్శనం, కణాదుని వైశేషిక దర్శనం, కపిల మహర్షి సాంఖ్య దర్శనం, పతంజలి యోగ దర్శనం, జైమిని పూర్వ మీమాంసా దర్శనం, బాదరాయణుని ఉత్తర మీమాంసా దర్శనం. స్వబుద్ధితో విచారించి ప్రవచించిన దర్శనాలలో మానవ తప్పిదాలు ఉండవచ్చుగాని వేద ప్రమాణాన్ని అంగీకరించి అంతర్దృష్టితో దర్శించి మనకు అందించిన దర్శనాలలో అలాంటి దోషాలు ఉండవని అంటారు. 

‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో, 

‘వేదాంత పరిభాష’ నుంచి..

- కళానిధి సత్యనారాయణ మూర్తి