ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): లోక కళ్యాణార్ధం ఆదిలాబాద్ లోని డైట్ మైదానంలో అత్యంత వైభవోపేతంగా జరుపుతున్న విశ్వశాంతి ఆయుత చండీయాగం భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతోంది. గత వారం పది రోజులుగా శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి సరూపానంద స్వామి నేతృత్వంలో ప్రతి నిత్యం ఉదయం హోమం, సాయంత్రం దేవతమూర్తుల కళ్యాణం, కుంకుమార్చనలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా శుక్రవారం చేపట్టిన శ్రీ లక్ష్మి గణపతి శ్రీ రుద్ర మృత్యుంజయ సహిత అమృత పాశు పశాస్త్ర హోమంలో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అదిలాబాద్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఇలాంటి యాగాలు ఆదిలాబాద్ లో జరగడం మనందరి అదృష్టమని ఎంపీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రతి రోజు వేలాదిగా తరలివస్తున్న భక్తుల్లో ఆధ్యాత్మికత నెలకొనడం అభినందనీయమని అన్నారు.