calender_icon.png 28 December, 2024 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత విద్యార్థులకు ఈ దేశాల్లో వీసాలు కఠినతరం

28-12-2024 02:04:47 AM

  • చదువు పూర్తి చేసిన తర్వాత 
  • అక్కడే కొలువు చేసేవారికి ప్రాధాన్యం 
  • భాషాపరంగా, వృత్తి నైపుణ్యాలకు పెద్దపీట

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: విదేశాల్లో ఉన్నత చదువులు చదవుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కలలకు అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా బ్రేకులు వేస్తున్నాయి. వీసా జారీ, ఇమ్మిగ్రేషన్ నిబంధ నలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ప్రతి దేశమూ తమ స్థానిక అవసరాలు, ఆర్థిక రంగం పురుగోతని ప్రాధాన్యంలోకి తీసుకుంటున్నాయి.

దీంతో విద్యార్థుల ఆశలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికా నిబంధనలు కఠినతరం చేయడంతో చాలాతక్కువ శాతంలో భారత విద్యార్థులకు వీసాలు జారీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిబంధనలు మరింత కఠినతరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, గ్రీన్‌కార్డు పాలసీలు మరింత కఠినతర మవుతాయం టున్నారు.

  గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడే ఉండి కొలువులు చేసే విద్యార్థులకు బ్రిటన్  ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలున్న వారికి సులువుగా అక్కడే నివాసం ఉండేందుకు  అవకాశం కల్పిస్తున్నది. గతంలో భారత విద్యార్థులకు వీసాల జారీలో చూసీచూడనటుల వ్యవహరించిన కెనడా ఇటీవల నిబంధనలను కాస్త కఠినతరం చేసింది. 

ఇమ్మిగ్రేషన్ నిబంధనల కారణంగా కెనడా 2021లో 70శాతం వీసాలు తగ్గాయి. చదువు పూర్తి చేసిన తర్వాత గ్రాడ్యుయేట్లు అక్కడే పనిచేయాలనే నిబంధనలు ఉండడమే అందుకు కారణం. కానీ, ఒక్కసారి వీసా జారీ అయితే మాత్రం అక్కడి ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్నది. సౌకర్యాలు కల్పిస్తున్నది. 2025 నాటికి అంతర్జాతీయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను కేవలం 2,70,000కు పరిమితం చేయాలని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఆ ప్రభావం అక్కడి యూనివర్సిటీల్లో చదువుదామనుకునే విద్యార్థులపై పడనున్నది. చదువు తర్వాత కొలువులపై మరిన్ని నిబంధనలను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్నది.  మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీ వీసా నిబంధనలను కాస్త సడలించినట్లే లెక్క. ముఖ్యంగా భాషాపరమైన నిబంధనల విషయంలో వెనక్కి తగ్గింది. చదువు తర్వాత అక్కడే పనిచేసేందుకు సిద్ధంగా ఉంటూ, నైపుణ్యాలూ కలిగిన 90,000 మందికి  వీసాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది.