calender_icon.png 28 October, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు విశాఖ - ఇటు హైదరాబాద్

28-06-2024 12:48:27 AM

  • శరవేగంగా సాగుతున్న పనులు

హైవేతో ఖమ్మం జిల్లాకు మహర్దశ

‘భారత్‌మాల’తో మారనున్న రూపురేఖలు 

విశాఖ మధ్య తగ్గనున్న దూరం

ఖమ్మం, జూన్ ౨7(విజయక్రాంతి): ఖమ్మం గ్రీన్ ఫీల్డ్  నేషనల్ హైవే నాలుగు లేన్ల రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు వల్ల పరిశ్రమల జోన్‌తో పాటు రెసిడెన్షియల్, స్కూల్ జోన్లు ఏర్పడనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అటు విశాఖపట్నం ఇటు హైదరాబాద్ మధ్య రవాణా మరింత మెరుగుపడనుంది. అంతేకాదు, ఈ నగరాల మధ్య 56  కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే (ఖమ్మం దేవరపల్లి), బ్రౌన్ ఫీల్డ్ హైవే (టేకుమట్ల ఖమ్మం) మీదుగా రాజమండ్రి వెళ్తే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడమే కాకుండా రెండు గంటల సమయం కూడా కలిసి రానుంది.  

‘భారత్‌మాల’లో తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే 

2015లో ‘ప్రధానమంత్రి భారత్‌మాల, సాగరమాల’ పథకాలను కేంద్రం రూపొందించింది. భారత్‌మాల కింద దేశంలో 24,800 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 93 నౌక పోర్టులకు సాగరమాల కింద రహదారి, రైలుమార్గాలను కలిపే ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది.  (ప్రస్తుతం కొవ్వూరు -భద్రా చలం రైల్వే లైన్, కాకినాడ పోర్ట్ కు తెలంగాణను కలుపుతూ సాగరమాల పథకంలో చేర్చారు).  భారత్‌మాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటగా ‘ఖమ్మం దేవరపల్లి’ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శ్రీకారం చుట్టింది.

ఇది ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం ప్రాంతాలకు ఈ జాతీయ రహదారి వరంగా మారనుంది. మొదట ‘సూర్యాపేట- దేవరపల్లి‘ మధ్య ఈ హైవేకు ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ అప్పటికే ఖమ్మం  సూర్యాపేట మధ్య బ్రౌన్ ఫీల్డ్ మంజూరైంది. దీంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి ఆ రోడ్డుకు అనుసంధానంగా ఖమ్మం- హైవేకు 2018లో శ్రీకారం చుట్టారు. 

వేగంగా భూ సేకరణ

ఖమ్మం- ప్రాజెక్టు ప్యాకేజీ నిర్మాణ పనులకు 548.08 ఎకరాల భూమి అవసరమని గుర్తించి ఇప్పటికి 507.2925 ఎకరాలకు అవార్డ్ పాస్ చేశారు. రూ. 144.84 కోట్ల డబ్బులను భూనిర్వాసితులకు చెల్లించారు. మరో 40.1875 ఎకరాల సేకరణ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇక ప్యాకేజీ కింద 424.19 ఎకరాలకు, 407.0450 ఎకరాలకు అవార్డ్ పాస్ చేశా రు. రూ. 98.34 కోట్ల పరిహారం చెల్లించారు. మరో 17.1450 ఎకరాల భూసేకరణ కొనసాగుతోంది. ప్యాకేజీ కింద 383.3325 ఎకరాలకు 371.1200 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసి, రూ. 88.94 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మరో 12.2125 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.  

ఎగ్జిట్ కోసం వేంసూరు, కల్లూరు గ్రామస్థుల విన్నపం

సత్తుపల్లి నియోజకవర్గం గుండా వెళ్తున్న ఈ హైవే మార్గంలో వేంసూరు, కల్లూరు మండలాల్లో ఎగ్జిట్ లేకపోవడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పినపాక స్టేజీ నుండి తల్లాడ వరకు, వీయం బంజర్ నుండి మండాలపాడు (లంకపల్లి), కిష్టారం నుండి సత్తుపల్లి, సత్తుపల్లి నుండి బేతుపల్లి మీదుగా గంగారం వరకు ఫోర్ లేన్, కల్లూరు పట్టణ పరిధిలో సిక్స్ లేన్ రహదారులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.                              

కాకినాడ పోర్టుకు రవాణా సులభం

తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో లభించే బ్లాక్ స్టోన్‌ను కాకినాడ పోర్ట్‌కు తరలించుటకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం ఖమ్మం నుండి దేవరపల్లికి ప్రయాణ దూరం 185 కి.మీ.  ఏరియల్ డిస్టన్స్ ద్వారా ఈ రహదారి అలైన్మెంట్ రూపొందించడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పట్టణాలకు ఈ రహదారి దూరం అయింది. ఖమ్మం నగరానికి 5.5 కి.మీ. వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి పట్టణానికి ఇది దగ్గరగా ఏర్పడింది. ఈ రహదారి ప్రతి పట్టణానికి 5.5 కి.మీ. దూరం ఉండేలా రూపొందించారు. ఖమ్మం పట్టణానికి 5.5 కి.మీ. వద్ద ప్రారంభం అయ్యే ఈ రహదారి దేవరపల్లికి 2.5 కి.మీ.వద్ద గుండుగోలను,- కొవ్వూరు గ్రామాలు జాతీయ రహదారికి అనుసంధానం కానున్నాయి.

కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం

ఖమ్మందేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనుల పురోగతికి ఆటంకంగా ఉన్న అటవీ అనుమతులనుమంజూరు చేయాలని బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి బృందం విజ్ఞప్తిచేసింది.