calender_icon.png 1 November, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్కాలో నాటి విశాఖ

27-06-2024 12:14:39 AM

మెగాప్రిన్స్‌గా పిలువబడే వరుణ్ తేజ్, తాజా చిత్రమైన ‘మట్కా’ కోసం తన రూపురేఖల్ని మార్చేశారు. కేవలం ఆయన లుక్ మాత్రమే కాదు..  కాలంలో కాస్త వెనక్కి  వెళ్ళిన ఈ కథ కోసం చిత్ర బృందం సైతం నాటి కాలంలోకి పయనించింది. ప్రేక్షకులని ఆ కథ జరిగే కాలానికి తీసుకెళ్ళే క్రమంలో అప్పటి ప్రపంచాన్ని మరలా తెరపై చూపించనున్నారు కళా దర్శకుడు  ఆశిష్ తేజ. కొంత విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్ నేపథ్యంలో తెరకె క్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ కోసం రూ. 15 కోట్లతో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. 35 రోజుల పాటు జరుగునున్న ఈ షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు కరుణ కుమార్.

దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథని రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి మరో కీలక పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘మట్కా’ చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు నిర్మాతలు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థల్లో డా.విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి కలిసి నిర్మిస్తున్న  ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, డీవోపీ: ఎ కిషోర్ కుమార్, ఎడిటర్: ఎ కార్తీక శ్రీనివాస్.