27-03-2025 11:56:15 PM
‘బాట్స్’ సమస్యను గుర్తించిన యూఎస్ కాన్సులేట్..
న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2 వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు తాజాగా దౌత్య కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అపాయింట్‌మెంట్ వ్యవస్థలో ఓ పెద్ద లోపాన్ని గుర్తించినందునే తాము నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ‘బాట్స్’ విధానంలో కొందరు ఏజెంట్లు, ఫిక్సర్లు అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఆ చర్యలను తాము ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. ఈ అనధికార చర్యలతో ప్రమేయం ఉన్న అధికారులపైనా వేటు వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
సాధారణంగా ఓ వ్యక్తి సొంతంగా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే.. అతడికి వెంటనే వీసా అపాయింట్‌మెంట్ దొరకదు. కానీ.. ఏజెంట్లు కొన్నిరకాల బాట్స్‌ను వినియోగించి స్లాట్స్‌ను ప్రభావితం చేస్తారు. అందుకు వీసా దరఖాస్తుదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఛార్జ్ చేస్తారు. అలా అపాయింట్‌మెంట్స్ 2023లో బీ1, బీ2 రోజుకు 999 పాయింట్‌కు చేరుకున్నది. దీంతో అమెరికా ప్రభుత్వం భారత దరఖాస్తుదారుల కోసం బ్యాంకాక్ వంటి ప్రాంతాల్లోనూ అపాయింట్‌మెంట్ పాయింట్లను ప్రారంభించాల్సి వచ్చింది. తద్వారా నిరీక్షణ సమయాన్ని మరింత తగ్గించాలనేది ధ్యేయం. కానీ.. మళ్లీ బాట్స్ సమస్య తలెత్తడంతో అగ్రరాజ్యం దానిని పరిష్కరించే పనిలో నిమగ్నమైంది.