28-02-2025 12:00:00 AM
అను ప్రొడక్షన్స్‌లో విరాజ్‌రెడ్డి చీలం కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. జగ పెద్ది దర్శకత్వంలో అనసూయరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది నిజామాబాద్. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సెటిల్ అయ్యాను. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఈ సినిమా మొత్తాన్నీ ఆస్ట్రేలియాలోనే షూట్ చేశాం. నేను అక్కడే ఉండేవాడ్ని కాబట్టి కరోనా తర్వాత అక్కడే అంతా ట్రైనింగ్ తీసుకున్న కొత్త నటీనటులతోనే ముందుకెళ్లాం. అందరినీ ఆడిషన్స్ పెట్టి తీసుకున్నాం. హీరోయిన్ మిమీ లియానార్డ్‌ది శ్రీలంక. కానీ ఆమెకు తమిళం వచ్చు. తెలుగులోనూ డైలాగ్స్ చక్కగా చెప్పారు. ఆమె పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.
ఆస్ట్రేలియాలో సినిమా తీసినప్పటికీ స్టోరీ మనదే. తెలుగు వాళ్ల వైబ్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఆస్ట్రేలియా ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడి సెక్యురిటీ గార్డ్ లైఫ్ వేరేలా ఉంటుంది. ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్‌కు కూడా బీఎండబ్ల్యూ కూడా ఉంటుంది. అందుకే అక్కడి ఓ సెక్యురిటీ గార్డ్ లైఫ్‌ను ఇందులో చూపించాను.
హర్రర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తీశాం. పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు. కథకు తగ్గట్టుగా అన్ని రకాల భావోద్వేగాలనూ చూపించాల్సి ఉంటుంది. ఓ కొత్త హీరోకు ఇంత కంటే మంచి డెబ్యూ దొరకదు. టీజర్, ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకున్నారు.
‘గార్డ్’తోపాటు నాది ఇంకో మూవీ కూడా సిద్ధమవుతోంది. డైరెక్టర్ జగ నాకు ముందు నుంచీ తెలుసు. హర్రర్ జానర్ అయితే కొత్త వాళ్లు అయినా కూడా జనాలకు ఎక్కువగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను కష్టపడి సంపాదించిందంతా ఈ సినిమాకే పెట్టాను. ఇక మళ్లీ జీరోతో ప్రారంభించాలి.
మా నాన్న రైతు. అందుకే ఫార్మర్‌తో టీజర్‌ను లాంచ్ చేయించాం. టీజర్, ట్రైలర్ ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోనే జరిగింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ ఇండియాలోనే జరిగింది. ఫైట్స్ అన్నీ కూడా చైనీస్ స్టుల్లో ఉంటాయి. సౌండింగ్, మ్యూజిక్ అన్నీ కూడా ఇండియన్ స్టుల్లో ఉంటుంది.
ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. కానీ ఓటీటీ కోసం ముందుగానే అన్ని భాషల్లో సిద్ధం చేసి పెట్టాను. మంచి టాక్ వచ్చి, ఎవరైనా ముందుకొస్తే ఇతర భాషల్లో విడుదల చేస్తాను.
సినిమా అనేది వ్యాపారం. నా సినిమాను ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా.. నాకు నేనే విడుదల చేసుకుంటానని ఈవెంట్లలో ముందే చెప్పాను. నాకు నేనుగా, నా ప్యాషన్‌తో ఇక్కడి వరకు వచ్చాను. సినిమాను కూడా నేనే రిలీజ్ చేసుకుంటాను.