calender_icon.png 26 December, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్రర్షి అమరేశం

23-09-2024 12:00:00 AM

మహాత్ములు అన్ని కాలాలలోను ఉంటారు. వారిని గమనించుకోవటం, వారి మార్గంలో పయనింప గలగడం ఇతరులకు మహాప్రయోజనం కలిగించే విషయం. అటువంటి మహాత్ములలో లెక్కకు వచ్చే వ్యక్తి బ్రహ్మశ్రీ అమరేశం రాజేశ్వరశర్మ. వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మౌలిక లక్షణాలు ఇలా ఉన్నాయి. 1.ఆజన్మ శుద్ధులు 2. ఋషికల్పుల శిష్యులు 3. ఋషిస్థాయిని విద్యా వ్యవసాయంతో సాధించిన వారు 4. అధ్యయన, అధ్యాపన నైపుణ్యం గలవారు. 5. శిష్య వాత్సల్యం చెలువు తీర్చినమూర్తి 6. గహనమైన శాస్త్ర సాంకేతిక విషయాలను ప్రసన్నంగా బోధించే ఉత్తమ అధ్యాపకులు. 7. సంస్కృతాంధ్రాంగ్లాది భాషా సాహిత్యాలలో గట్టి పట్టు ఉన్న నిండుకుండ. 8. జీవితంలో ఎక్కువ భాగం సమాజ సేవకై వెచ్చించిన ఆదర్శప్రాయ వ్యక్తి. 9. ఫలం వైపు చూపు పెట్టని కర్మయోగి.

జన్మాంతర సంస్కారం

అమరేశం రాజేశ్వరశర్మ 1965-67 సంవత్సరాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉన్నారు. ఆ విద్యా సంవత్సరంలో నేను ఎం.ఏ. పట్టా కోసం అక్కడ విద్యార్థినయ్యాను. వారు మాకు తెలుగు వ్యాకరణం బోధించారు. వ్యాకరణం వారికి అభిమాన బోధనాంశం. శాస్త్ర బోధనలో అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, ‘విషయం విద్యార్థికి తలకు ఎక్కుతున్నదా లేదా?’ అనే దానిమీద ఆయనకు దృష్టి ఉండటం. చాలామంది ‘నన్ను చూడు, నా అందం చూడు’ అన్న ధోరణిలో ఉంటారు. కొందరు విద్యార్థి స్థాయికి దిగి వచ్చి, బోధించే ప్రతి అంశమూ విద్యార్థి హృదయంలో పది కాలాలపాటు నిలిచిపోవాలన్న జాగరూకతతో బోధిస్తూ ఉంటారు. ఇది నేర్చుకొంటే వచ్చే విద్య కాదు. సహజంగా, జన్మాంతర సంస్కారం వల్ల అభివ్యక్తమయ్యే గొప్ప లక్షణం. ఆయనలో ఆ లక్షణం పరిపూర్ణ వికాసంలో ఉన్నట్లు విద్యార్థి దశలోనే నేను గమనింపగలిగాను.

ఉత్తమ ఆచార్యులు

“ఆచినోతి హి శాస్త్రాణి ఆచారే స్థాపయ త్యపి

స్వయమాచరతే యస్తు స ఆచార్య ఇతిస్మృతః”

అన్న పాత కాలపు మాట ఒకటి ఉన్నది. శాస్త్ర విషయాలన్నింటినీ సమగ్రంగా పోగు చేసుకోవడం, వాటిని ఆచారంలో నెలక్పొలడం, స్వయంగా ఆచరించడం అనే మూడు లక్షణాలు పుష్కలంగా ఉన్న అధ్యాపకుడే ‘ఆచార్య’ శబ్దవాచ్యుడు అవుతాడు. నా అనుశీలనకు అందిన విషయం అమరేశం వారు ఈ మూడు లక్షణాలూ ఉద్వేగంగా ఉన్నవారు. 

గొప్ప ‘కులపతి’ 

పెద్ద సంఖ్యలో విద్యార్థులకు అన్న వస్త్రాదులను కల్పించి, విద్యావంతులను చేసే మహాత్ములను ‘కులపతి’ అని భారతీయ సంప్రదాయం వ్యవహరిస్తుంది. అమరేశం వారికి ఇది చక్కగా అన్వయిస్తుంది. కామారెడ్డిలో వారొక ప్రాచ్య విద్యా కళాశాలను నెలకొల్పి, ఉన్నత ప్రమాణాలుగల అధ్యాపకులను ఏరి కోరి తెచ్చి పెట్టి, సారస్వత సేవ చేసిన ఉదాత్తగుణ సంపన్నులయ్యారు. 

మహా పరిశోధక చక్రవర్తి

పది కాలాలపాటు పరిశోధకులకు దిశానిర్దేశం చేయగల పరిశోధనా గ్రంథాలను ఎన్నింటినో రూపొందించి, ఒక తరుగువోని సంపద గా భద్రపరచి ఉంచిన మహా పరిశోధక చక్రవర్తి. 

లౌక్యం తెలియని ఋజువర్తనుడు

ఇచ్చకాలతో పబ్బం గడుపుకొనే లౌక్యం ఏ మాత్రమూ లేనివాడు. ఈ లక్షణం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయక నిష్కళంకం గా దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా విద్యావ్యవస్థలో తన ముద్ర భద్రంగా ఉండే తీరులో మెలగిన ఉత్తమ అధ్యాపకుడు. నిండు మనంబు నవ్యనీత సమానం. పల్కు దారుణా ఖండల శస్త్ర తుల్యము కాని విశిష్ట విప్ర వరేణ్యుడు. ‘అందరూ సుఖపడాలి’ అనే భావన హృదయంలో పదిలంగా నిలుపుకున్న నిజమైన భారతీయుడు. 

ఎక్కడి భాగ్యనగరం, ఎక్కడి కొవ్వూరు?

తొంభై దాటిన తరువాత కూడా సుదూర ప్రాంతంలో తాను తొలి వయసులో చదువుకున్న కళాశాలలో, ఏ మాత్రమూ ప్రతిఫలం ఆశించకుండా పాఠాలు చెప్పి వచ్చే అధ్యాపన వ్యసనం ఉన్న మహామనీషి. ఎక్కడి భాగ్యనగరం, ఎక్కడి కొవ్వూరు? స్థూలదేహం శరీరమైనా సూక్ష్మదేహం వయఃపాటవంతో విజృంభించే, గంతులు వేసే స్థితిలో నిలుపుకున్న అమరేశం వారు, ప్రాయముకై వ్రాలిన దశవైపు క్రీగంటితో కూడా చూడకుండా ప్రాచ్య విద్యార్జన తత్పరులైన వటువులకు పాఠాలు చెప్పారు. ఆ ప్రవచనం, నాకు తెలిసి వారి 94వ యేడు నిండిన తరువాత కూడా వాడి పోలేదు. వాడిగానే సాగింది. ఇది ప్రపంచ ప్రమాణాల పుస్తకాలకు ఎక్కదగిన మహావిషయం. (ఇటువంటి వ్యక్తియే విశాఖపట్టణంలో ఒకామె ఉన్నారు. ఆమెకూడా ఇంతే వయస్సులో ప్రతి దినమూ 20 కి.మీ. ప్రయాణించి భౌతికశాస్త్ర పాఠాలు చెప్తున్నారు. ఆమె ఆచార్య శాంతమ్మ).

మరణశయ్యమీద మంత్రజపం

అమరేశం రాజేశ్వరశర్మ సారస్వత విద్యలోనేకాదు, ఆధ్యాత్మిక విద్యలో కూడా పరిణత ప్రజ్ఞ ఉన్నవారు. వారు మరణశయ్య మీద ఉన్నప్పటి ఒక ఫొటో వారి కుమారులు నాకు చూపించారు. వారి పెదవులు అతివేగంగా కదలాడుతున్నాయి. ఏదో మంత్రజపం ఆబగా చేస్తున్న వైఖరి నాకు తెలియవచ్చింది. దుర్భరమైన శరీర వేదన అతలాకుతలం చేస్తున్నా, వారి అంతఃకరణం ధ్యానముద్రలో నిలిచి పోవడం చాలా అపురూపమైన విషయం. భగవంతుడు విస్పష్టంగా చెప్పాడు.

‘అంత కాలే చ మామేవ స్మరన్యుక్తా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః’. ‘ప్రాణావసాన సమయంలో నన్నే స్మరిస్తూ కళేబరాన్ని విడిచి వెళ్లిపోయే జీవుడు నన్నే చేరుకుంటాడు’. ఇందులో ఏ మాత్రమూ సంశయం లేదు. సాక్షాత్తు శ్రీవాసుదేవ పరబ్రహ్మం పలికిన రసమయ వాక్యం ఇది. దీనికి సమన్వయ భూమి విప్రర్షి అమరేశం రాజేశ్వరశర్మ. శాస్త్ర ప్రమాణాలనుబట్టి వారు పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్యనివాసం చేస్తున్నారనుకోవడం అతిసహజమైన, సత్యమైన సంభావం.

ఎందరికో విద్యాదానం

క్రోధి భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు మహాత్ములు, మహానుభావులు, వేదమూర్తులు బ్రహ్మశ్రీ అమరేశం రాజేశ్వరశర్మ శివైక్యం చెందారు. వారు నా వంటి లబ్ధ ప్రతిష్ఠులెందరికో విద్యాదానం చేసిన పుణ్యశ్లోకులు, సార్థకమైన జీవనాన్ని అత్యంత సమర్థంగా సాగించి, తొంభై అయిదు సంవత్సరాలు ముగిసిన తరుణంలో భౌతిక కాయాన్ని పరిత్యజించి వెళ్లిపోయారు. సార్థక జీవనులు, సంతుష్ట చిత్తులు, శతమానానికి అత్యంత సన్నిహితంగా తనువు చాలించిన వారు కనుక వారి మరణం నా వంటివానికి దుఃఖోద్విగ్నతను కలిగించలేదు. అలా మరణించడం నా దృష్టిలో ఒక భాగ్య విశేషం.

ఒక విజ్ఞాన సర్వస్వం

అమరేశం రాజేశ్వరశర్మ విద్యారంగంలో, ఉద్యోగ ప్రస్థానంలో, సమాజ సేవా కార్యక్రమాలలో, రచనా వ్యాసంగంలో ఒక విలువైన ముద్రను శాశ్వతంగా నిలిపి వెళ్లిపోయారు. వారితో మాట్లాడుతున్నంత సేపు మనం ఒక విజ్ఞాన సర్వస్వం ముందర కూర్చున్నామనే భావన కలుగుతూ ఉండేది. సాధారణంగా వారి మాటలలో వావదూకత అణుమాత్రమైనా ఉండదు. వాగ్మిత అక్షరాక్షరంలో ద్యోతమానం అవుతూ ఉండేది.

వెనుకటి జన్మలో యోగాభ్యాస పరీపాక దశలో ఏదో చిన్ని స్ఖావిత్యం సంభవించగా ఆ జీవుడు, గీతలో చెప్పినట్లుగా శుచులు శ్రీమంతులు అయిన వారి ఇంటిలో జన్మించిన విధంగా, అమరేశం వారి జన్మకర్మలు నా వంటి వానికి హృదయంలో కదలాడుతూ ఉంటాయి. నా దృష్టిలో అమరేశం వారు అనన్వయాలంకారానికి లక్ష్యప్రాయంగా నిలువ దగిన వారు. అంతకాలంలో హరినామ స్మరణ హృదయంలోనూ, భగవన్నామ జపం నాలుక మీదనూ ఆడుతూ ఉండగా, ప్రాణత్యాగం చేసిన మహాత్ములు వారు. వారికి అక్షయ పుణ్యలోకాలు చక్కగా అమరి ఉంటాయనటంలో నాకెంటువంటి సందేహమూ లేదు.

శలాక రఘునాథశర్మ

98660 68542