27-02-2025 12:08:45 AM
కీసరగుట్టపై ఇష్టానుసారంగా పాసుల జారీ
పాసులు లేకున్నా వాహనాలను గుట్ట పైకి పంపిన పోలీసులు
మేడ్చల్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): కీసరగుట్ట పై విఐపి ల దర్శనాలు ఎక్కువ కావడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. సామాన్య భక్తుల కష్టాలు పట్టించు కోకుండా ప్రభుత్వ అధికారులు, దేవస్థానం కమిటీ సభ్యులు, పోలీసులు వీఐపీల సేవలో తరించి పోయారు. అధికారులు తమకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా విఐపి పాసులు జారీ చేశారు. దీంతో విఐపి ల తాకిడి ఎక్కువైంది. దీనికి తోడు పోలీసుల సైతం వాహనాలకు ఎలాంటి పాసులు లేకున్నా గుట్ట మీదకు పంపారు.
ప్రతి ఒక్కరూ వీఐపీలుగా రావడంతో వారి వాహనాలతో గుట్టపైన పార్కింగ్ కు ఇబ్బంది అయింది. విఐపి ల దర్శనాలతో సామాన్య భక్తుల దర్శనం ఆలస్యమైంది. సామాన్యులకు నాలుగైదు గంటల సమయం పట్టింది. వృద్ధులు, చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అంతేగాక వీఐపీలకు ఉచిత దర్శనాలు చేయించారు. క్యూలైన్లో ఉచిత దర్శనం తో పాటు ప్రత్యేక దర్శనాలకు టికెట్ పెట్టిన అధికారులు వీఐపీలకు ఉచిత దర్శనాలు చేయించడం గమనార్హం.