calender_icon.png 24 September, 2024 | 4:46 AM

వనపర్తిలో జోరుగా ధాన్యం దందా!

24-09-2024 02:11:40 AM

బియ్యం ఆడించకుండానే ధాన్యం అమ్మకాలు

రాష్ట్రం దాటించి కోట్లు కొల్లగొడుగుతున్న మిల్లర్లు 

తతంగమంతా అధికారుల అండదండలతోనే! 

తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు 

వనపర్తి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ధ్యానం దందా జోరుగా కొనసాగుతోంది. రైతుల నుంచి సేకరించిన వరిని మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ, సీఎంఆర్‌లకు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తిరిగి వాటిని పీడీఎస్ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేస్తాయి. ఈ నేపథ్యంలో ఒక్కో రైస్‌మిల్లర్ క్వింటా ధన్యానికి 60 కిలోల బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. వరికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన మిల్లర్లు సిండికేట్‌గా మారి తమకు కేటాయించిన ధ్యానాన్ని బియ్యంగా మార్చకుండా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రైతు వద్ద తీసుకున్న ధ్యానానికి క్వింటాల్‌కు రూ.1900 చొప్పున కేటాయిస్తే, ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.3 వేలకు పైగా ధర పలుకుతుండడంతో ఈ అక్రమ రవాణాకు బీజంపడింది. తరుచు ఆయా రైస్‌మిల్లులను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం మిల్లర్లతో కుమ్మకై అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రైతులు యేటా రెండు దఫాలు వరి సాగుచేస్తారు. ప్రతీ సీజన్‌లో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 100కు పైగా ఉన్న మిల్లులకు ఈ ధ్యానాన్ని కేటాయించగా కేవలం పదుల సంఖ్యలో మాత్రమే సరైన విధానంలో బియ్యాన్ని ఆడించి ఎఫ్‌సీఐ, సీఎంఆర్‌లకు అప్పగిస్తున్నాయి. మిగతా 80 శాతం మిల్లర్లు ధ్యానాన్ని ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్నారు.

అధికారుల అండదండలు

రైస్‌మిల్లులను తరుచూ పర్యవేక్షించాల్సిన అధికారులు మిల్లర్లతో కుమ్మకై ధ్యానాన్ని పక్కదారి పట్టించడంలో సహకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పలువురు రైస్‌మిల్లర్లు నిత్యం పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తుంది. 2022 రబీ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 80 రైస్‌మిల్లులకు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధ్యానాన్ని ఇచ్చారు. కేటాయింపులకు సరిపడా బియ్యం అందకపోవడంతో ఆయా మిల్లల్లో తనిఖీలు చేపట్టగా అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా ధ్యానమే  కనిపించకపోవ డంతో అధికారులు ఖంగుతింటున్నారు. ఈ వ్యవహారం పట్ల సివిల్ సప్లయ్ అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో బట్టబయలు.. 

మిల్లర్లు సిండికేట్‌గా మారి ధ్యానాన్ని పక్కదారి పట్టించినట్లు తెలుసుకున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు విషయాలు బయటపడుతున్నాయి. గత శుక్రవారం రాత్రి వీపనగండ్ల మండలంలోని గోపాల్‌రెడ్డి ఇండస్ట్రిటీలో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.7.86 కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వనపర్తి మండలంలోని రిలిక్స్ ఇండస్ట్రీట్‌లో రూ 33.83 కోట్ల విలువైన ధాన్యం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.  శనివారం కూడా రెండు రైస్‌మిల్లులపై దాడులు జరగాల్సి ఉండగా అందులో ఓ మిల్లు యజమాని రాష్ట్రస్థాయి నేత కావడంతో తెర వెనుక చక్రం తిప్పినట్లు తెలిసింది.