calender_icon.png 23 September, 2024 | 4:02 PM

ఆ మూడు కుటుంబాల వల్లే హింస

22-09-2024 12:06:46 AM

  1. గాంధీ, ముఫ్తీ, ఒమర్ కుటుంబాలను పక్కన పెట్టాలి
  2. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 

శ్రీనగర్, సెప్టెంబర్ 21: ‘జమ్ముకశ్మీర్‌లో గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కుటుంబాలే హింసను ప్రేరేపించాయి. కాబట్టి ప్రజలు వారు నేతృత్వం వహించే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలను ప్రజలు పక్కన పెట్టాలి. తద్వారా వారసత్వ రాజకీయాలకు ప్రజలు ముగింపు పలకాలి. కుటుంబపాల న పీడను కశ్మీర్‌కు వదిలించాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌లో శనివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఇప్పటికే పంచాయతీ, బ్లాక్‌స్థాయి ఎన్నికలు జరిగేవి కావన్నారు.

1947 నుంచి పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతి యుద్ధాన్నీ సైన్యం ఎదుర్కొంటున్నదని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కశ్మీర్ యువత చేతుల్లో రాళ్లు, తుపాకులు తీసేసి పెన్నులు, ల్యాప్‌టాప్‌లు పట్టుకునేలా చేస్తున్నదని స్పష్టం చేశారు. త్వరలో కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మిలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడి పాలకులు పాకిస్థాన్‌ను చూసి భయపడేవారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని మోదీని చూసి భయపడుతుందని అభిప్రాయపడ్డారు.