మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రం సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మం ది కుకీ మిలిటెంట్లు హతమైనట్లు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. కాగా కాల్పులు జరిగిన ప్రాంతంలో కనిపించకుండా పోయిన ఆరుగురి కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు.
మంగళవారం ఘటనాస్థలం లో ఇద్దరు పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఐకె ముయివా చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవా న్లు గాయపడ్డారని ఆయన చెప్పారు. జిరిబామ్ జిల్లాలో సైనికుల్లా దుస్తులు ధరించిన మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీసుస్టేషన్‌పై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, పక్కనే ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపుపైనా దాడి చేశారని చెప్పారు.
అనంతరం దగ్గర్లో ఉన్న జకురాడోర్ కరోంగ్ గ్రామం వైపు దూసుకువెళ్లి దుకాణాలకు నిప్పుపెట్టడంతో భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. చనిపోయిన వారినుంచి ఏకే రైఫిళ్లు లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, దీన్నిబట్టి వారు సామాన్యపౌరులు కాదని, మిలిటెంట్లని అర్థమవుతుందని ఐజీ చెప్పారు. అయితే పోలీసుల వాదనను మణిపూర్‌లో వివిధ గిరిజన జాతుల సంఘా ల ఉమ్మడి వేదిక అయిన ఐటీఎల్‌ఎఫ్ తోసిపుచ్చింది.
మృతిచెందిన వారం తా కూడా విలేజ్ వలంటీర్లని, అంతకు ముందు రోజు జైరాన్ గ్రామంలో మీతీలు ఓ మహిళను హత్య చేసిన నేపథ్యంతో వారంతా గస్తీ విధుల్లో ఉ న్నారని వాదిస్తోంది. అంతేకాదు, మణిపూర్‌లో జాతుల ఘర్షణలు మొదలైనప్పటినుంచి కూడా కుకీ మిలిటెంట్లు కేంద్ర బలగాలపై ఎప్పుడూ దాడి చేయలేదని వారంటున్నారు. జీరిబామ్ గ్రామంపై మీతీ మిలిటెంట్లు దాడి చేసినప్పుడు దగ్గర్లోనే ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు మౌనప్రేక్షకుల్లాచూ స్తూ ఉండిపోయారని ఐటీఎల్‌ఎఫ్ నేతలు ఒక ప్రకటనలో ఆరోపించారు.
కాగా గతంలో రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఒక ఘటనలో ఇంతమంది చనిపోవడం జరగలేదని, దీనిబట్టి చూస్తే సీఆర్‌పీఎఫ్, మీతీ మిలిటెంట్లు విలేజ్ వలంటీర్లపై దాడి చంపేసినట్లు కనిపిస్తోందని కూడా పేర్కొన్నారు. ఇదిలాఉండగా సోమవారం ఎన్‌కౌంటర్ దృష్ట్యా మంగళవారం జిరిబామ్ జిల్లా అంతటా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్‌నెట్ కనెక్షన్లు నిలిపివేశారు. మరోవైపు సీఆర్‌పీఎఫ్ జవాన్లను తమ క్యాంపునుంచి బైటికి రానివ్వబోమ ని కుకీ విద్యార్థి సంఘం హెచ్చరించింది.
అంతేకాదు విలేజి వలంటీర్లను దారుణంగా హత్య చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో హోం శాఖ ఉన్నతాధికారులు మణిపూర్ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్‌లో స్థానిక జాతులమధ్య అధికారులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చినప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం.
గత ఏడాది మేనుంచి మణిపూర్‌లో కుకీలు, మైతీ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 200 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. వందలమంది గాయపడగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ హింసపై ప్రతిపక్షాలన్నీ పార్లమెంటు లోపల, బయటా పెద్దఎత్తున ఆందోళన చేసినప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
రాహుల్ గాంధీ రెండు సార్లు మణిపూర్‌లో పర్యటించి బాధితులను ఓదా ర్చే ప్రయత్నం చేశారు కానీ ప్రధాని మోదీ మాత్రం ఒక్కసారి కూడా రాష్ట్రా న్ని సందర్శించలేదు. మణిపూర్‌ను భారత్‌లో భాగంగా కేం ద్రం భావించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా సర్కార్‌కు మాత్రం చీమకుట్టి నట్లయినా లేదు. ఓ రాష్ట్రం ఇంతకాలంగా హింసతో అట్ట్టుడుకుతు న్నా పట్టించుకోని కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటన మళ్లీ రాష్ట్రం భగ్గుమనేలా చేస్తుందేమోనని భయపడుతున్నారు.